Politics

రెడ్ బుక్ కక్ష సాధింపు కోసం కాదు-NewsRoundup-June 27 2024

రెడ్ బుక్ కక్ష సాధింపు కోసం కాదు-NewsRoundup-June 27 2024

* నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘రెడ్‌ బుక్‌’ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని.. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన‌ ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

* టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక సెమీస్‌ ముగియగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడి క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ-రోహిత్ (Virat Kohli – Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంభాషించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డగౌట్‌కు వచ్చిన పంత్‌తో ఇదే విషయంపై కోహ్లీ చర్చించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు.

* నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

* వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. సొంత నియోజవర్గం పుంగనూరులో మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక తెదేపా ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. త్వరలో వారంతా తెదేపాలో చేరనున్నారు. ఈ సందర్భంగా అలీంబాషా మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని.. అధికారం ఉండదని వ్యాఖ్యానించారు.

* లాభాల్లో ఉన్న సింగ‌రేణిని న‌ష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు.

* బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను త‌న చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం న‌డిపారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీ అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో కుటుంబ స‌భ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించారు.

* సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్‌ అధికారుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు ఆయనను మళ్లీ ఏపీ కేడర్‌లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆయనను రాష్ట్ర సర్వీస్‌లోకి పంపుతూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో లడ్డాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.

* బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS Delhi) చేర్పించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆయన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్లు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను దవాఖానలో చేర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

* ఆరు నూరైనా రైతు రుణమాఫీ చేసి తీరుతామని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆగస్టులోగా రెండు లక్షలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తామని.. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని.. రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టమొచ్చినట్టు రైతుభరోసా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడి, విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అన్ని హామీలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుక సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను కూడా అదే రోజు వెల్లడించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. నియామకాల ప్రక్రియను డిసెంబరు 10లోగా పూర్తి చేసి, జాయిన్ ఆర్డర్స్ కూడా అభ్యర్ధులకు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 80 శాతం పోస్టులు స్థానికులకి అవకాశం ఇచ్చేలా నోటిఫికేషన్‌ను రూపొందిస్తున్నారు. మిగిలిన 20 శాతం పోస్టులను నాన్ లోకల్ కింద భర్తీ చేసే అవకాశం ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z