Kids

నీట్ లీక్ నిందితుల అరెస్టులు ప్రారంభించిన సీబీఐ-CrimeNews-June 27 2024

నీట్ లీక్ నిందితుల అరెస్టులు ప్రారంభించిన సీబీఐ-CrimeNews-June 27 2024

* నీట్‌-యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు (NEET-UG paper leak case) దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్‌ ప్రకాశ్‌, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో లీకైన పేపర్‌ను పొందిన విద్యార్థులను మనీశ్‌ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. వీరిలో రెండు డజన్ల మందికి అతడే ఒక రూమ్‌ కూడా బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో నిందితుడైన అశుతోష్‌ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. ఇప్పటికే పేపర్‌ లీక్‌కు సంబంధించి సీబీఐ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బిహార్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదుచేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్‌లోని గోద్రా తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై ఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది. నీట్‌-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్‌ బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్‌ 4న ఎన్‌టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.

* ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ శివారులో నివసించే బాలికను కానిస్టేబుల్‌ ప్రదీప్‌ ప్రేమ పేరుతో లోబర్చుకొని అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. గతేడాది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్‌కి తరలించారు.

* గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సీఐకి సూచించారు. సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు. బూట్లతోనే లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు. సీఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో బుధవారం సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.

* ఏపీలోని పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident )ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని వినుగొండ మండలం కొత్తపాలెం వద్ద అతి వేగంగా వచ్చిన కారు (Car) చెట్టును ఢీకొట్టింది. గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్‌ శర్మ కుటుంబం కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు ఇన్నోవా కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బాలగంగాధర్‌ శర్మ, ఆయన సతీమణి యశోద, కారు డ్రైవర్‌ మృతి చెందారు. బాల గంగాధర్‌ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగ సంధ్య, వీరి పిల్లలు కార్తిక్‌, అనుపమ గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z