Business

గృహ విక్రయాలు తగ్గుముఖం-BusinessNews-June 27 2024

గృహ విక్రయాలు తగ్గుముఖం-BusinessNews-June 27 2024

* దేశంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైల్‌ (Bullet Train) కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఇవి జరగనున్నాయి’’ అని పేర్కొన్నారు. సరికొత్త భారత్‌ ముఖ చిత్రాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలు మార్చేస్తాయని తెలిపారు. ఇప్పటికే మొదలైన అహ్మదాబాద్‌ – ముంబయి హైస్పీడ్‌ రైలు వ్యవస్థ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాదాపు 508 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌ దేశంలోనే మొదటిది. సాధారణంగా బుల్లెట్‌ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లెక్కన రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో ఇది పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో సూరత్‌, వడోదరలో దీనికి స్టాప్‌లు ఉన్నాయి. ది నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో తొలిఫేజ్‌లో సూరత్‌-బిల్మోర మధ్య నిర్మాణాన్ని ఆగస్టు 2026 నాటికి పూర్తి చేయనున్నారు. తొలిదశలో ఆరు రైళ్లను జపాన్‌ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు ఉన్న మార్గంలో విఖ్రోలీ వద్ద 21 కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైలు మార్గం భూగర్భ సొరంగంలోనే ఉంటుంది. ఇందులో ఏడు కిలోమీటర్ల మార్గం సముద్రగర్భంలో సాగుతుంది. పర్వతాలను తొలుచుకుంటూ అయిదు కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు చొప్పున మొత్తం 12 రైల్వేస్టేషన్లు రానున్నాయి. బాంద్రాకుర్లా కాంప్లెక్సు వద్ద దాదాపు 10 అంతస్తుల లోతైన నిర్మాణం ఒకటి రానుంది. ఠాణే-వాపీ మధ్య ఎత్తయిన కారిడార్‌ పనులూ వేగంగా సాగుతున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీల ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు.. మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, రిలయన్స్‌, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు దీనికి కారణం.

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎల్‌జీ తమ భారత అనుబంధ సంస్థను పబ్లిక్‌ ఇష్యూ (LG Electronics India IPO) ద్వారా తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు సన్నాహాలు ప్రారంభించినట్లు ఆ దేశ ప్రముఖ వాణిజ్య పత్రిక ఇన్వెస్ట్‌ చొసున్‌ ఇటీవల వెల్లడించింది. భారత్‌లో గృహోపకరణాల విభాగంలో బలమైన అమ్మకాలు నమోదవుతున్న నేపథ్యంలో దాన్ని నిధుల సమీకరణకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఐపీఓ (IPO) నిమిత్తం ఇప్పటికే ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (LGEIL) ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌ సహా స్థానిక నియంత్రణ సంస్థలను కంపెనీ వర్గాలు సంప్రదించినట్లు పేర్కొంటూ ఇన్వెస్ట్‌ చొసున్‌ తన కథనంలో వెల్లడించింది. జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఈ ఐపీఓ నిర్వహణలో భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సియోల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎల్‌జీ.. దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద బహుళజాతి సంస్థల్లో ఒకటి. టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు సహా గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో తనదైన ముద్ర వేసింది. త్వరలో భారత్‌లో ఐపీఓకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ప్రతినిధిని నియమించనున్నట్లు సమాచారం.

* సాధారణంగా ఏదైనా వస్తువును ఈ-కామర్స్‌ వేదికల్లో కొనుగోలు చేస్తే (Online Orders) ఒకట్రెండు రోజుల్లో దాన్ని డెలివరీ చేస్తారు. ఒక్కోసారి కస్టమర్‌ రష్‌ ఎక్కువగా ఉంటే మహాఅయితే వారం లేదా నెల రోజులు పట్టొచ్చు. కానీ, ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో చేసిన ఆర్డర్‌ను ఆరేళ్లయినా కంపెనీ డెలివరీ చేయలేదు సరికదా.. ఇన్నాళ్లకు యూజర్‌కు ఫోన్‌ చేసి ‘సమస్య ఏంటీ’ అని తాపీగా అడిగింది. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఆ కస్టమర్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ముంబయి (Mumbai)కి చెందిన అహ్‌సన్‌ ఖర్‌బాయ్‌ 2018 మే 16న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.485 చెప్పులను ఆర్డర్ (Order) చేశాడు. మూడు రోజుల తర్వాత వాటిని షిప్పింగ్‌ చేయగా.. అదే ఏడాది మే 20న డెలివరీ చేస్తామని వెబ్‌సైట్‌లో చూపించింది. అయితే, ఇప్పటికీ అవి యూజర్‌కు చేరలేదు. పైగా.. అప్పటినుంచి ప్రతిరోజు ఆర్డర్‌ స్టేటస్‌లో ఇంకా ‘ఈరోజు వస్తాయి (అరైవింగ్‌ టుడే)’ అనే చూపిస్తోందట..!

* దేశంలో గృహ విక్రయాలు (Home sales) తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం విక్రయాలు క్షీణించాయి. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదుకావడం రెండేళ్లలో ఇదే తొలిసారి అని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్‌ తెలిపింది. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికం (Q1)లో 1,30,370 గృహాలు అమ్ముడవగా.. రెండో త్రైమాసికం (Q2)లో ఆ సంఖ్య 1,20,340కు తగ్గినట్లు పేర్కొంది. 2022లోనూ ఇలానే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 15 శాతం మేర విక్రయాలు క్షీణించాయి. జనవరి- మార్చి త్రైమాసికంలో 99,550 ఇళ్ల విక్రయాలు జరగ్గా.. రెండో త్రైమాసికంలో 84,925 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకుముందు త్రైమాసికంలో అధిక విక్రయాలు నమోదుకావడం ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి కారణమని అన్‌రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురీ పేర్కొన్నారు. దీంతోపాటు గతేడాది ప్రాపర్టీల ధరలు భారీగా పెరగడమూ మరో కారణమని విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఇళ్ల ధరలు 7 శాతం మేర పెరిగాయని అన్‌రాక్‌ పేర్కొంది. గతేడాదితో పోల్చినప్పుడు ఈ పెరుగుదల 25 శాతంగా ఉందని తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే.. దేశ రాజధాని ప్రాంతంలో (NCR) 10% మేర పెరగ్గా.. హైదరాబాద్‌లో 9%, బెంగళూరులో 8% ఈ పెరుగుదల ఉందని తెలిపింది. ధరలు స్థిరంగా ఉంటే రాబోయే నెలల్లో గృహ విక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. ఒక్క ఎన్‌సీఆర్‌ (6%) మినహా ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా నగరాల్లో గృహ విక్రయాల్లో క్షీణత నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గతేడాదితో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో 11%, ముంబయి, బెంగళూరులో 9% చొప్పున పెరుగుదల నమోదు కాగా.. చెన్నై (9%), కోల్‌కతా (20%) నగరాల్లో గృహ విక్రయాల్లో క్షీణత నమోదైనట్లు అన్‌రాక్‌ నివేదిక వెల్లడించింది.

* మారిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సైబర్‌ మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి మోసాల్లో సిమ్‌ కార్డులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సిమ్‌ స్వాప్‌ పేరుతో ఇటీవల మోసాలు ఎక్కువుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మన పేరు మీద ఇంకొకరు సిమ్‌ కార్డును తీసుకోవడమే సిమ్‌ స్వాపింగ్. అయితే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడాకి టెలికం సంస్థ ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.వినయోగదారుల భద్రతను పెంచుతూ జూల్‌ 1వ తేదీ నుంచి సిమ్‌ కార్డులకు సంబంధించి నియమాలను మార్చనున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి నిబంధనను మార్చాలని నిర్ణయించారు. సిమ్ స్వాప్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. కొత్తగా తీసుకొస్తున్న ఈ నిబంధనల ప్రకారం.. ఒకవేళ మీరు సిమ్‌కార్డును కోల్పోయినా, పాడైపోయినా వెంటనే సిమ్‌ తీసుకోవడానికి వీలుపడదు.ప్రస్తుతం సిమ్‌ కార్డ్‌ కోల్పోతే వెంటనే స్టోర్ నుంచి కొత్త సిమ్‌ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొత్త సిమ్‌ కార్డ్‌ను తీసుకోవడానికి కనీసం 7 రోజులు పాటు వేచి చూడాల్సిందే. ఏడు రోజుల లాకింగ్ వ్యవధి అమలు చేయనున్నారు. ఒక సిమ్‌ కార్డు కోల్పోతే అదే నెంబర్‌తో మరో సిమ్ కార్డ్‌ యాక్టివేట్ చేసుకోవాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.దీంతో ఒకవేళ మన ప్రమేయం లేకుండా మన సిమ్‌ కార్డును ఎవరైనా స్విమ్‌ స్వాపింగ్ చేస్తే తెలిసిపోతుంది. మీ ప్రమేయం లేకుండా ఏడు రోజుల పాటు సిమ్‌ డీ యాక్టివేట్‌లో ఉంటే, కచ్చితంగా మీ సిమ్‌ కార్డు విషయంలో అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నేరాలు తగ్గుతాయి. ఇదిలా ఉంటే సిమ్ స్వాపింగ్ ద్వారా నేరస్థులు మీ నెంబర్ పై కొత్త సిమ్ ను యాక్టివేట్ చేసుకుంటారు. దీంతో మీ ఓటీపీలను సులభంగా యాక్సెస్ చేసి మీ ఖాతాల్లోని డబ్బును సులభంగా కాజేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z