Business

జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ-BusinessNews-June 28 2024

జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ-BusinessNews-June 28 2024

* జియో బాటలోనే ఎయిర్‌టెల్‌ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 10-21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులోభాగంగానే టారిఫ్‌లను పెంచుతున్నట్లు వెల్లడించింది.

* ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance industries) మరోసారి అరుదైన ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా రూ.21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. శుక్రవారం మార్కెట్‌ ప్రారంభంలోనే కంపెనీ షేరు సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. ఒకానొక సమయంలో కంపెనీ షేరు విలువ 1.69శాతం ఎగబాకి రూ.3,129కి చేరుకోవడంతో మార్కెట్‌ విలువ పెరిగింది. దీంతో రిలయన్స్‌ ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్‌ విలువ ఇప్పటివరకు 20శాతానికి పైగా పెరిగింది.

* దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 428 పాయింట్ల రికార్డు గరిష్టంతో 79,671.58 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 130 పాయింట్లు (0.53 శాతం) పుంజుకుని ఆల్ టైం హై 24,174 పాయింట్లకు దూసుకెళ్లింది.

* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీని గురువారం ప్రత్యేకంగా భేటీ అయి ఆదుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో లక్ష మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణతోపాటు ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర సర్కార్‌ ప్రారంభించిన యశస్వని పథకం కింద తెలంగాణ రాష్ర్టానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.

* వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) గత ఆర్థిక సంవత్సరం చివరకు 12 ఏళ్ల కనిష్ఠమైన 2.8 శాతానికి పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి 2.5 శాతానికి దిగొస్తాయని అంచనా వేసింది. నికర ఎన్‌పీఏలు (ఎన్‌ఎన్‌పీలు) కూడా 0.6 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల జీఎన్‌పీఏలు 2023-24 రెండో అర్ధ భాగంలో (అక్టోబరు-మార్చి) 76 బేసిస్‌ పాయింట్లు (0.76%) తగ్గాయి. 2025 మార్చి కల్లా జీఎన్‌పీఏలు 2.5 శాతానికి దిగొస్తాయని, ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మాత్రం 3.4 శాతానికి పెరగొచ్చని నివేదిక అంచనా వేసింది. 2024 మార్చి చివరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 3.7 శాతంగా ఉండగా, పరిస్థితులు దారుణంగా ఉంటే.. 2025 మార్చి కల్లా ఇవి 4.1 శాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. ప్రైవేటు రంగ బ్యాంకుల జీఎన్‌పీఏలు 1.8% నుంచి 2.8 శాతానికి, ఎఫ్‌బీల జీఎన్‌పీఏలు 1.2% నుంచి 1.3 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z