ScienceAndTech

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎమర్జెన్సీ-CrimeNews-June 28 2024

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎమర్జెన్సీ-CrimeNews-June 28 2024

* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్‌(Sunita Williams), బచ్‌ విల్మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు నాసా గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన స్పేస్‌క్రాఫ్ట్‌ల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 5 నుంచి అక్కడ ఉన్న విలియమ్స్‌, విల్మోర్‌లు స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో తల దాచుకొన్నారు. దాదాపు గంటసేపు మిషిన్‌ కంట్రోల్స్‌ ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్‌ ఇచ్చారు. రష్యాకు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహం రిస్యూర్స్‌-1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఇది బుధవారం దాదాపు 100 ముక్కలుగా విడిపోయింది. ఈ పరిణామాలు మొత్తం ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలోనే చోటు చేసుకొన్నాయి. కొన్ని గంటల పాటు దీనినుంచి శకలాలు వెలువడ్డాయని లియోల్యాబ్స్‌ అనే స్పేస్‌ ట్రాకింగ్‌ సంస్థ పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌ ఏజెన్సీ నుంచి ఎటువంటి వివరణ వెలువడలేదు. ఇప్పటికే అంతరిక్షంలో వేల సంఖ్యలో ఉపగ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం పనిచేస్తున్న శాటిలైట్లకు ప్రమాదకరంగా మారాయి.

* నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్‌ మదర్సాలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. నిన్న( గురువారం) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, మదరసా చారిటబుల్ ట్రస్ట్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురు కరిష్మా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వందల కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ట్రస్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. డీప్ ఫ్రీజ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్‌ గౌస్‌.. మాంసాన్ని పరిశీలించారు. ఫ్రీజ్‌లో 100 కేజీల మటన్‌ ఉందని.. ఈ నెల 17వ తేదీన తెచ్చిన మటన్ నేటికి వాడుతున్నారని తెలిపారు. బుధవారం పుడ్ పాయిజన్ జరిగింది.. కరిష్మా అనే బాలిక మృతి చెందింది. 8 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. మదర్సాకు నోటీసులు ఇచ్చాం’ అని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

* ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు వచ్చిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆ ఐస్‌ క్రీమ్‌లో వచ్చిన వేలు ఎవరిదో పోలీసులు నిర్ధారించారు. అయితే తెగిపడిన ఆ వేలు ఐస్‌క్రీమ్‌లో రావడం వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను ముంబైలోని మలాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి అదానే వెల్లడించారు. ‘ఐస్‌ క్రీమ్‌లో వచ్చిన వేలును డీఎన్‌ఏ పరీక్షకు పంపించాం. కంపెనీలో అసిస్టెంట్‌ ఆపరేటర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డీఎన్‌ఏను కూడా డీఎన్‌ఏ పరీక్షకు పంపాం. ఆ రెండు డీఎన్‌ఏ శాంపిల్స్‌ మ్యాచ్‌ అయ్యాయి. ఇక ఎవరి నిర్లక్ష్యంవల్ల ఐస్‌క్రీమ్‌లోకి వేలు వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తాం’ అని రవి అదానే చెప్పారు. ఘటనపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌లు 272, 273, 336 కింద కేసులు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ లేడీ డాక్టర్‌ ఆన్‌లైన్‌లో ఐసీక్రీమ్‌ ఆర్డర్‌ చేసింది. ఐతే ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం చూసి ఆమె కంగుతిన్నారు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనక నుంచి ఢీకొట్టడం వల్ల శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z