* చార్‌ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్‌నాథ్‌కు యాత్రికులు పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ఉన్న శివయ్య దర్శనం కోసం.. దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నీలకంఠుడి దర్శనం చేసుకుని ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నారు. కేదార్‌నాథ్‌కు వచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
* ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి హీనాఖాన్ (hina khan) స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. అభిమానులు తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. కాగా హీనాఖాన్ పోస్ట్‌పై తోటి నటులు, అభిమానులు స్పందిస్తూ.. మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెట్టారు. బాలీవుడ్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనాఖాన్ ఒకరు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’లో ఆమె పోషించిన అక్షర పాత్ర ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు పొందింది. అంతే కాకుండా హీనా బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు.
* భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
* పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలూ తీసుకుంటాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం’’ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతో పాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రదర్శించారు.
* భారీ వర్షాలతో(Delhi rainfall) దేశరాజధాని దిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్ నేత, దిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా వాటిల్లో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు.
* తనపై దాఖలైన పోక్సో(POCSO) కేసును రద్దు చేయాలని కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Yediyurappa) కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో ఆయనపై పోలీసులు గురువారం ఛార్జిషీట్ దాఖలు చేశారు.17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో సదాశివనగర్ పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID) ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది.ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. తనపై కుట్రలకు పాల్పడేవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
* దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
* తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు.
* ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
* పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దానికిముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది.
* భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో స్మృతి మంధాన (149), షఫాలీ వర్మ (128*) సెంచరీలు బాదేశారు. దీంతో తొలి వికెట్‌కు 292 పరుగులు (52 ఓవర్లలో) జోడించారు.
* దేశ రాజధాని దిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు కొంతభాగం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ టర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే.. దాన్ని 2009లోనే ప్రారంభించారని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలోనే అప్పటి పౌర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ (Praful Patel) దీనిపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
* రోహిత్‌కు బ్యాటింగ్‌లో అందరికంటే కొంచెం ఎక్స్‌ట్రా టైం ఉంటుందంటారు.. అందుకే షాట్లు కచ్చితంగా ఉండి బంతి బౌండరీ దాటేస్తుంది. అలానే కెప్టెన్సీలో కూడా అతడికి కొంచెం దూరదృష్టి ఎక్కువ. అందరికీ అస్పష్టత ఉన్న అంశాల్లో కూడా అతడు కచ్చితమైన అభిప్రాయానికి రాగలడు. అందుకే కేవలం 12 నెలల్లోనే 3 ఐసీసీ ప్రపంచ ట్రోఫీల (టెస్టు, వన్డే, టీ20) ఫైనల్స్‌కు జట్టును తీసుకెళ్లగలిగాడు. ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. టీమ్ ఎంపిక నుంచి మైదానంలో వ్యూహాల వరకు చాల భిన్నంగా అతడు వర్క్ చేస్తాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో అతడి ముద్ర స్పష్టంగా కనిపించింది.
* దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పరీక్షకు ముందే పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో.. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతోపాటు విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు.
* వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి తమ పార్టీకి టచ్‌లో లేరని.. వాళ్లను తాము ఆహ్వానించమని స్పష్టం చేశారు. వాళ్లను పార్టీలో చేర్చుకునే ఆలోచనే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇక ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు చెప్పడంపై కూడా సోము వీర్రాజు స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి మారట్లేదని విమర్శించారు. ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అదే తీరు కనబరుస్తుందని.. ఇప్పుడు పార్లమెంటులో కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z