* ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు (Credit card) నిబంధనల్లో కొన్ని మార్పులు చేశాయి. రివార్డు పాయింట్లు, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేశాయి. జులై నెలలోనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి.
ఎస్‌బీఐ: క్రెడిట్ కార్డు రివార్డులకు సంబంధించి ఎస్‌బీఐ కార్డ్స్ కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తోంది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల కార్డులపై మాత్రం జులై 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను రూ.100 నుంచి రూ.200కు ఐసీఐసీఐ బ్యాంక్ (ఎమరాల్డ్ కార్డు మినహా) పెంచింది. అదే సమయంలో చెక్/ క్యాష్ పికప్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్, డయల్ ఏ డ్రాఫ్ట్ లావాదేవీ ఛార్జీ, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్‌పై ఇకపై ఛార్జీలు వసూలుచేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్ణయించింది. రెంట్ పేమెంట్‌పై 1 శాతం చొప్పున ఛార్జీ వసూలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
సిటీ బ్యాంక్: సిటీ బ్యాంక్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంక్‌కు సంబంధించి క్రెడిట్ కార్డు అకౌంట్స్ జులై 15 నాటికి యాక్సిస్ బ్యాంక్‌లో పూర్తిగా విలీనం అవుతాయి. కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు జారీ అయ్యేవరకు సిటీ బ్రాండ్ కార్డులు పనిచేస్తాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, విలీనం వరకు ఉన్న పాయింట్లు ఎప్పటికీ ఎక్స్‌పైర్ కావని, మైగ్రేషన్ తర్వాత మాత్రం మూడేళ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్‌పైర్ అవుతాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
* ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (VI) తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచాయి. తొలుత జియో పెంపు నిర్ణయం ప్రకటించగా.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ అదే బాటలో నడిచాయి. జియో, ఎయిర్‌టెల్ సవరించిన ప్లాన్లు జులై 3 నుంచి అందుబాటులోకి రానుండగా.. వొడాఫోన్ ఐడియా ప్లాన్లు జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ లోపు రీఛార్జి చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి. పెరిగిన ఛార్జీలతో 28 రోజులకు జియోలో కనీస రీఛార్జి మొత్తం రూ.189కి చేరగా.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో రూ.199కి పెరిగింది. 56 రోజుల ప్లాన్ విషయంలో మూడు టెలికాం కంపెనీల ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎక్కువ మంది వినియోగించే 84 రోజుల ప్లాన్ ధర జియోలో రూ.666 నుంచి రూ.799కి పెరగ్గా.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు రూ.719 నుంచి ఏకంగా రూ.859కి ఎగబాకాయి. డేటా ప్లాన్, పోస్ట్ పెయిడ్ ధరలూ భారీగానే పెరిగాయి.
* మోసగాళ్లు రకరకాలుగా ఉంటారు.. టెక్నాలజీ పెరగడంతో సైబర్ ఫ్రాడ్ చేసే వారు కొందరు ఉంటే.. మరి కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అధికారులను బురిడీ కొట్టిస్తుంటారు. మోసపూరితంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి బాబర్ ఖాన్ ఓ వ్యక్తి దొంగిలించిన, ఫొర్జ్డ్ ఐడీ కార్డుల ఆధారంగా నకిలీసంస్థలు సృష్టించాడు. అలా దేశవ్యాప్తంగా సంస్థలు తయారు చేసి రమారమీ రూ.10 వేల కోట్ల జీఎస్టీకి శఠగోపం పెట్టాడు. వేల కొద్దీ కంపెనీలు తయారు చేసి.. వాటి పేరు మీద ఈ-వే బిల్లులు రూపొందించి, ప్రభుత్వం నుంచి ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందాడు. ఈ సంగతిని నొయిడా పోలీసులు గతేడాది జూన్ ఒకటో తేదీన గుర్తించారు. జీఎస్టీ ఫ్రాడ్ ముఠా ఉందని అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, సిర్సా, జైపూర్, ఛింద్వారా ప్రాంతాల వాసులు 47 మందిని బాబర్ ఖాన్ తన ఫ్రాడ్ లో భాగస్వాములను చేశాడు.
* దేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియాలతో పోటీ పడుతున్న టాటా మోటార్స్ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నది. 2030 నాటికి దేశీయ కార్ల మార్కెట్లో 18-20 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నది. 2030 నాటికి ఏటా దేశీయంగా 60 లక్షల కార్లు అమ్ముడవుతాయని టాటా మోటార్స్ అంచనా వేసింది. 2024-25 నుంచి 2029-30 నాటికి ఏయేటికాయేడు ఆరు శాతం కార్ల విక్రయాలు పెరుగుతాయని పేర్కొంది. ఒకవైపు సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లు, మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తూ దేశీయ మార్కెట్లో తన వాటా పెంచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z