DailyDose

ఇద్దరు భార్యల సాక్షిగా ఘనంగా మూడో పెళ్లి-CrimeNews-June 30 2024

ఇద్దరు భార్యల సాక్షిగా ఘనంగా మూడో పెళ్లి-CrimeNews-June 30 2024

* మాయమాటలు చెబుతూ.. ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం తన కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్‌ ఖాసీం(25) కూలి పనిచేసేవాడు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడిన అతడు రెండున్నర ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. కూలి పనులు చేస్తూ.. వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కూలీలు, అమాయకులైన మహిళలకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తానని నమ్మించి.. దూర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు. ఇలా ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23న మహబూబ్‌నగర్‌ పట్టణం టీడీగుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమె డబ్బులు అడగగా.. తనవద్ద ఉన్న టవల్‌ను ఆమె మెడకు చుట్టి.. బ్లేడుతో గొంతు కోశాడు. రాయితో ముఖంపై మోదీ చంపేశాడు. ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను తస్కరించాడు. మే 24న మృతదేహాన్ని గుర్తించిన భూత్పూర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మహబూబ్‌నగర్‌ షాసాబ్‌గుట్ట వద్ద కాసమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2022 నుంచి ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. భూత్పూర్‌ పరిధిలో ఇద్దరిని, హన్వాడ, వనపర్తి, బిజినేపల్లి, మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణాల పరిధిలో ఒక్కొక్కరిని హత్య చేశాడని.. కాసమయ్యపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

* ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. ఈక్రమంలో రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిష్టారం సమీపంలో అదుపుతప్పి బస్సును ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

* ఒక భార్యనే మోయడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్‌లో కొందరు కుర్రాళ్లు.. కానీ అల్లూరి జిల్లాలో అయితే ఇద్దరు భార్యలతో ఎంచక్కా సంసారం సాగించే ఓ భర్త.. ఇప్పుడు ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అఫీషియల్‌గానే.. అందుకు అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేనా.. వారిద్దరూ పెళ్లి పెద్దల్లా మారి అన్ని తామై చూసుకున్నారు. హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు. మా భర్తకు మూడో పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని శుభలేఖలు కూడా పంచారు. మీ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ ప్రతి ఒక్కరి గడపకు వెళ్లి… పెళ్లి కార్డు ఇచ్చి మరి ఆహ్వానం పలికారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుం..డా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు. అయితే.. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న.. లక్ష్మీ అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మీని ఇష్టపడ్డ విషయం .. తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు. జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవవధువు లక్ష్మీ తరపు బంధువులు, మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్‌గా పండన్న లక్ష్మీల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖసంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు.

* కొందరు కేటుగాళ్లు పుష్ప సినిమాలో హీరో తరహాలో ఇస్మార్ట్ పద్దతిలో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించి అడ్డంగా బుక్కవుతున్నారు. శామీర్ పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. ఓ గంజాయి మఠా గుట్టు రట్టయింది. అయితే పోలీసులకు చిక్కకుండా నిందితులు మస్త్ స్కెచ్ వేశారు. బొలోరో వాహనంలో గంజాయిని పెట్టి.. పైకి పనస పండ్ల లోడ్ అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు వాహనం మొత్తం చెక్ చేయగా బండారం బయటపడింది. గంజాయి తరలిస్తున్న బోలెరో వాహనంతో పాటు.. దానికి పెట్రోలింగ్ వ్యవహరించిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాడ సాయి, బండారు శివకుమార్, గేదెల సతీష్‌లను అదుపులోకి తీసుకుని.. 35 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. శివ అనే మరో నిందితుడు తప్పించుకున్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి ఈ గంజాయి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్థులుగా గుర్తించారు.

* ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్‌గా ప్రస్తుతం పింకేలీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారు. అయితే ఆసుప్రతిలో రాత్రుళ్లు షూటింగ్ జరపడంతో.. అక్కడున్న రోగులు చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతోపాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది. అంతేకాదు అత్యవసర చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్రయూనిట్ అడ్డుకున్నారని.. ఆసుపత్రిలో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించింది నిర్మాతల సంఘం. ఆసుపత్రిలో షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని తెలిపింది. అయితే ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z