Politics

విశాఖ నుండి ఉచిత బస్సు ప్రారంభానికి కసరత్తు-NewsRoundup-June 30 2024

విశాఖ నుండి ఉచిత బస్సు ప్రారంభానికి కసరత్తు-NewsRoundup-June 30 2024

* కాంగ్రెస్‌ పార్టీకి డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో డీఎస్‌ భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

* ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేస్తే.. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

* విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైకాపా సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు.

* కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీన్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్‌ అభ్యర్థులకు మాత్రం రాలేదని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

* ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. ‘‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’’ పేరుతో తీసుకొచ్చిన కొత్త ప్రచారం గురించి ప్రస్తావించారు. ‘‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’’ అని పిలుపునిచ్చారు.

* టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో నాలుగు ఐసీసీ టైటిల్స్‌ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్‌ (2008), వన్డే ప్రపంచ కప్‌ (2011), ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచ కప్‌ (2024) కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. టీమ్‌ఇండియాకు సుదీర్ఘకాలంపాటు కెప్టెన్‌గా ఉన్న మహేంద్రసింగ్ ధోనీకి ఈ రికార్డు సాధ్యం కాలేదు.

* బాల్య స్నేహితులిద్దరు దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ(Army), నేవీ(Navy) అధిపతులు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దినేష్‌ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రేవాలోని సైనిక్ స్కూల్‌ (Rewa Sainik School)లో కలిసి చదువుకున్నారు. నాటి నుంచే వారిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది. ప్రస్తుతం వారు వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుతుంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్‌కు దక్కుతుంది’’ అని అభినందించారు.

* ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా రూ.కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. అయితే, తాను చనిపోయిన తర్వాత ఆ విరాళాలు ఉండవని చెప్పారు. వాటిని తన ముగ్గురు కుమారులు నిర్వహిస్తారని.. ఇందుకు సంబంధించి వీలునామాలో మార్పులు చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ‘‘నా మరణం తర్వాత బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు డబ్బులు రావు. నా పిల్లలకు వీటిని నిర్వహించగల సామర్థ్యం ఉందని విశ్వసిస్తున్నా’ అని వారెన్‌ బఫెట్‌ తన వీలునామాలో పేర్కొన్నారు. ఇప్పటికే వారు వేర్వేరు దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన మరణానంతరం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారని అన్నారు.

* నీట్‌ పరీక్షల వివాదంపై కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పందించారు. నీట్‌ రగడపై పార్లమెంట్‌ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్‌సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు. అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోంది, స్కామ్‌లు ఎక్కడ నుంచి వెలుగుచూస్తున్నాయో గమనించాలని అన్నారు.

* తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరిగాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ తీర్మానాలు భక్తులకు తెలిసేలా తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థికశాఖలో డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించిన డీవోపీటీ .. కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది.

* మరో నాలుగు నెలల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీలోని పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) వెల్లడించారు. ఆదివారం ఆయన పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్సీపీ(ఎస్‌పీ), శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌ ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని స్పష్టం చేశారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలు, పీడబ్ల్యూపీ వంటి మిత్రపక్షాల ప్రయోజనాల్ని పరిరక్షించడం తమ నైతిక బాధ్యత అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వలేకపోయామని.. ఈసారి వారి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టంతా మహారాష్ట్ర ఎన్నికలపైనే ఉందన్నారు.

* విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైకాపా సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.

* ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జులై 6 నుంచి నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని చెప్పారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.

* మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z