Business

పెరుగుతున్న స్టూడెంట్ లోన్స్ ఎగవేతలు-BusinessNews-June 30 2024

పెరుగుతున్న స్టూడెంట్ లోన్స్ ఎగవేతలు-BusinessNews-June 30 2024

* ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరో ఖ్యాతిని సాధించింది. దేశీయంగా ఉన్న కార్పొరేట్‌ బ్రాండ్లలో అత్యంత విలువైన నాలుగో సంస్థగా అవతరించింది. కంపెనీ బ్రాండ్‌ విలువ 9.8 బిలియన్‌ డాలర్లతో ఈ స్థానం దక్కించుకున్నదని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా 100-2024 విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏఏఏ బ్రాండ్‌ రేటింగ్‌తో సంస్థకు 88 స్కోర్‌ సాధించినట్లు తెలిపింది. అలాగే టాప్‌-10 బలమైన దేశీయ బ్రాండ్లలో మూడో స్థానంలో నిలిచింది. బీమా బ్రాండ్ల ర్యాంకింగ్‌లో ఎల్‌ఐసీ తన తొలిస్థానాన్ని పదిలపరుచుకున్నది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీమా సంస్థల విలువలో 9.8 బిలియన్‌ డాలర్లతో ఎల్‌ఐసీ తొలి స్థానంలో నిలిచింది. క్యాథీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రెండో స్థానంలో నిలువగా, ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 96.50 శాతం వాటా ఉండగా, ప్రజలకు 3.50 శాతం వాటా ఉన్నది. స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన సంస్థలో ప్రజలకు కనీసంగా 10 శాతం వాటా ఉండాలనే నిబంధనలపై ఎల్‌ఐసీకి మరో మూడేండ్ల గడువు ఇచ్చింది. మే 16, 2027 నాటికి ఎల్‌ఐసీఐలో ప్రజల వాటా 10 శాతానికి పెంచుకోవాలని సూచించింది. మే 17, 2022లో స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన విషయం తెలిసిందే. 3.5 శాతానికి సమానమైన 22.13 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం విక్రయించింది.

* అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24లో దేశీయ ఎగుమతులు 778.2 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.64.50 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇందులో వస్తువుల ఎగుమతులు 437.10 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.36 లక్షల కోట్లు) కాగా.. సేవల ఎగుమతులు 341 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.28.50 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌-రష్యా, ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ఎర్ర సముద్రం సంక్షోభం రూపంలో అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మంత్రి అన్నారు. అలాగే ఐరోపా లాంటి కొన్ని దిగ్గజ దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఎగుమతులు పెరుగుతుండటం (మేలో 9 శాతం వృద్ధి) ఒక సానుకూల సంకేతమన్నారు. భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్రపంచం కోరుకుంటున్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని ఇక్కడ జరిగిన రత్నాలు, ఆభరణాల ఎగుమతిదార్ల కార్యక్రమంలో మాట్లాడుతూ గోయల్‌ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పైగా నమోదుకావచ్చని భావిస్తున్నామని, ఇదే జరిగితే ఓ చరిత్రాత్మక రికార్డు అవుతుందని వివరించారు. గత సంవత్సరం కరెంటు ఖాతా లోటు కూడా తగ్గిందని తెలిపారు. ఎగుమతులు పెరిగితే తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంలో భారత్‌ 5.7 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 0.6 శాతం కరెంటు ఖాతా మిగులును నమోదు చేసింది. కరెంటు ఖాతా మిగులు నమోదు కావడం గత పది త్రైమాసికాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. విద్యుత్‌ వాహనాల వాడకం పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడటమూ తగ్గుతుందని మంత్రి తెలిపారు.

* వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని, అయితే ఈ రంగంలో ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిభావంతుల గిరాకీ-సరఫరా వ్యత్యాసం సుమారు 55-60 శాతం మధ్య ఉన్నట్లు అంచనా.

* వ్యక్తిగత రుణాల విభాగంలో విద్యా రుణాల్లోనే ఎక్కువగా ఎగవేతలున్నట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. గృహ రుణాల్లో డిఫాల్టర్లు తక్కువగా ఉన్నట్టు చెప్పింది. పర్సనల్‌ లోన్లలో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్‌పీఏ) అత్యధికంగా ఎడ్యుకేషన్‌ లోన్లే ఉన్నాయని ఈ ఏడాది జూన్‌కుగాను ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో క్రెడిట్‌ కార్డు రుణాలు, వాహన రుణాలుండగా.. చివరి స్థానంలో గృహ రుణాలున్నట్టు స్పష్టమైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z