NRI-NRT

ఆస్ట్రేలియా చదువులు మరింత భారం-NewsRoundup-July 01 2024

ఆస్ట్రేలియా చదువులు మరింత భారం-NewsRoundup-July 01 2024

* పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి జర్తాజ్ గుల్(Zartaj Gul) సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతున్నా స్పీకర్‌ సాధిక్‌(Sadiq) చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నా పార్టీ నాకు ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పింది. నేను ప్రజల తరపున వచ్చిన నాయకురాలిని. 1,50,000 ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నావైపు చూడకుండా ఉంటే మాట్లాడలేను. దయచేసి మీరు కళ్లజోడు పెట్టుకొని నాపైపు చూడండి’’ అంటూ ఆమె స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్‌ హాస్యాస్పదంగా స్పందిస్తూ.. నేను మీ మాటలు వింటాను. కానీ మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మర్యాదగా అనిపించదు. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. అనంతరం జర్తాజ్ గుల్ మాట్లాడుతూ మహిళలను సూటిగా చూడకూడదని మీరు అనుకొని సభలో 52శాతం మహిళలను తొలగిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో పాల్గొంటారు అంటూ కౌంటర్‌ వేశారు. ఈ వీడియోను పాక్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్‌ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

* దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్‌ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారన్నారు. ‘‘నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా’’ అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ మాట్లాడుతుండగా ప్రధాని సహా భాజపా ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలపడం గమనార్హం.

* విద్యార్థులకు ఆస్ట్రేలియా(Australia)లో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో 473 అమెరికన్‌ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు 1,068 డాలర్లకు పెంచింది. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వలసలను బలవంతంగా నియంత్రించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం అక్కడికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడేవారి సంఖ్య ఆల్‌టైమ్‌ హైలో ఉంది. ఫలితంగా ఇది గృహ మర్కెటింగ్‌ రంగంపై ప్రభావం చూపిస్తోంది.ఇక టెంపరరీ గ్రాడ్యుయేట్‌, విజిటర్‌, మారిటైమ్‌ క్రూ వీసాలు ఉన్నవారు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రస్తుతం ఆ దేశంలో నివాసం ఉంటున్న వేల మంది భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.‘‘నియమాల్లో ఈ మార్పులు మొత్తం నేటి నుంచి (జులై 1) అమల్లోకి వస్తాయి. మా అంతర్జాతీయ విద్యావిధానం మరింత బలంగా మారేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాం. కేవలం దేశాన్ని బలోపేతం చేసేలా ఈ చర్యలు చేపట్టాం’’ అని ఆ దేశ హోం సెక్రటరీ క్లారె ఓనెయిల్‌ పేర్కొన్నారు.ఆస్ట్రేలియాలో కేవలం అసలైన విద్యార్థులు వీసాలు పొందేలా, దేశ ఆర్థికవ్యవస్థకు అది ఊతమిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీనికితోడు వీసా వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకొంటూ విదేశీ విద్యార్థులు అక్కడే ఉండిపోవడాన్ని ఇది నిరోధిస్తుంది. ఆ దేశ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్‌ 30తో ముగిసే ఏడాది కాలంలో 5,48,000 మంది వలస వచ్చారని పేర్కొంది. ఇక భారత్‌ నుంచి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో 2022 ఒక్క సంవత్సరమే 1,00,009 మంది రిజిస్టర్‌ అయ్యారు. ఇక జనవరి 2023 నుంచి సెప్టెంబర్‌ వరకు 1.22 లక్షల మంది విద్యార్థులున్నారని లెక్కలు చెబుతున్నాయి. అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియా విద్యార్థి వీసా మరింత ఖరీదైంది. ఆయా దేశాల్లో 185 డాలర్లు, 110 డాలర్లు కాగా.. ఆస్ట్రేలియాలో 1,068 డాలర్లుగా ఉంది.

* జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్‌ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారు. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, షేర్‌ చేసిన ఫొటోలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మీరు వ్యక్తపరిచినట్టు మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అని ‘ఎక్స్‌’లో లోకేశ్‌ సమాధానమిచ్చారు.

* తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

* అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. గగన్‌యాన్‌కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. మిషన్‌కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు.

* భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు.‘‘శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి.గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు.క్యాంపు ఆఫీస్‌లో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నిచర్‌ నేనే తెచ్చుకుంటానని తెలిపాను. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా.. కానీ పంచాయతీరాజ్‌ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం, నేల కోసం పనిచేస్తున్నానని తెలిపాను.

* ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు. ఈరోజు(జూలై 1వ తేదీ) పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌ భార్య హరితారెడ్డి.. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్‌ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతే కాకుండా ఎస్‌ఐ రమేష్‌ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని ఎస్‌ఐ రమేష్‌ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్‌ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

* టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్‌మెంట్‌ను బట్టి తెలుస్తుంది.భారత్‌ హెడ్‌ కోచ్‌ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్‌తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్‌) భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కొత్త హెడ్‌ కోచ్‌ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్‌ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్‌ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్‌ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు హెడ్‌ కోచ్‌ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్‌ పెర్పార్మెన్స్‌ నేపథ్యంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి రేసులో గంభీర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల అమలు ద్వారా శిక్ష కన్న న్యాయానికి పెద్దపీట వేసినట్లు కేంద్ర హోంశాఖ మంతి అమిత్‌ షా తెలిపారు.బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)గా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్‌ఏ)గా మార్చారు. ఈ మూడు చట్టాలపై కేంద్ర మంత్రి అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు.

* ఏపీ కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌.. సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్ర‌ధాని ముందు డిమాండ్ చేస్తే.. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని విమ‌ర్శించారు. మోదీ ప్ర‌భుత్వంలో కింగ్ మేక‌ర్‌గా ఉన్న బాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా అని నిల‌దీశారు.15 ఏళ్లు ప్ర‌త్యేక‌ హోదా కావాలని అడిగిన రోజులు గుర్తులేదా అని మండిపడ్డారు ష‌ర్మిల‌. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పిన బాబే.. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేద‌ని ప్ర‌శ్నించారు. మోసం చేసిన ప్ర‌ధాని మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఏపీకి ప్రత్యేక హోదాపై బాబు వైఖరి ఏంటో చెప్పాలని ష‌ర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

* గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మే అని జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుర‌క‌లంటించారు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. జ‌గిత్యాల‌కు ప‌ట్టిన శ‌ని పోయింద‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఉత్సాహంగా ఉన్న‌ట్లు అనిపిస్తోంది. కొన్ని సంద‌ర్భాల్లో క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌షుల విలువ తెలుస్త‌ది. గాలికి గ‌డ్డ‌పార‌లు కొట్టుకుపోవు. గ‌ట్టి నాయ‌కులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మే. గ‌డ్డిపార‌ల్లాంటి మీరు వెళ్ల‌లేదు.. ఒక గ‌డ్డిపోచ మాత్ర‌మే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజ‌య్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

* కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z