Business

తగ్గిన ఈవీ విక్రయాలు. భారీగా చలామణిలో ₹2వేల నోట్లు-BusinessNews-July 01 2024

తగ్గిన ఈవీ విక్రయాలు. భారీగా చలామణిలో ₹2వేల నోట్లు-BusinessNews-July 01 2024

* దేశంలో విద్యుత్‌ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌ నెలలో 14 శాతం తక్కువ విక్రయాలు నమోదయ్యాయి. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్‌ పోర్టల్‌లోని డేటా ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఇప్పటివరకు 8,39,545 విద్యుత్‌ వాహనాలు (కార్లు, స్కూటర్లు) అమ్ముడయ్యాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈ సంఖ్య 6.69 శాతం కాగా.. ఈవీ విక్రయాల్లో టూవీలర్ల వాటా 57 శాతంగా ఉంది. విక్రయాలు చూస్తే.. మే నెలలో 1,23,704 వాహన విక్రయాలు నమోదుకాగా.. జూన్‌లో ఆ సంఖ్య 1,06,081కు తగ్గింది.విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో గతేడాది ప్రభుత్వం కోత పెట్టింది. గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని రూ.60వేల నుంచి రూ.22,500కు కుదించింది. దీంతో విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్థలు జూన్‌ నెల నుంచి ధరలు పెంచాయి. దీంతో అప్పట్లో కొనుగోళ్లు క్షీణించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి విద్యుత్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని కేంద్రం సగానికి కుదించింది. ఫేమ్‌-2 స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ద్విచక్ర వాహనానికి గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని రూ.10వేలకే పరిమితం చేసింది. త్రిచక్ర వాహనాల సబ్సిడీలోనూ కోత పెట్టింది. ఓవైపు సబ్సిడీలో కోత పడడం, మరోవైపు హైబ్రిడ్‌ వాహనాలపై ఆసక్తి చూపుతుండడంతో ఈ ఏడాది జూన్‌లో ఈవీ సేల్స్‌ తగ్గుముఖం పట్టడానికి కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్‌ 281 బీఎన్‌ఎస్‌, ఎంవీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్‌ఐఆర్, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి లాభాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, పైనాన్షియల్‌ షేర్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. ఈ క్రమంలోనే సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి.ఉదయం సెన్సెక్స్‌ 79,043.35 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,561 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.25 డాలర్లు, బంగారం ఔన్సు 2,338 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర రూ.2వేల నోట్లు (Rs 2,000 Notes) తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే నిరుడు అక్టోబర్‌ 7దాకా దేశంలోని అన్ని బ్యాంక్‌ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.

* ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ (LPG cylinder) ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.

* విద్యుత్ ఛార్జీలు వసూలులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులలో థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ అనుమతి ఇవ్వొదని పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వినియోగదారులకు ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే యాప్ ల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు వినియోగదారులకు TGSPDCL తెలిపింది. ఆన్ లైన్ లో కరెంట్ బిల్ కట్టాలంటే TGSPDCL వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే చెల్లించాలని సూచించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z