Business

BSNL బంపర్ ఆఫర్-BusinessNews-July 02 2024

BSNL బంపర్ ఆఫర్-BusinessNews-July 02 2024

* ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్‌ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. జులై 3 నుంచి జియో, ఎయిర్‌టెల్‌.. జులై 4 నుంచి వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌లు పెరగనున్నాయి. దీంతో యూజర్లంతా తక్కువ ధరతో ఉన్న ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రూ.249 ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ప్రభుత్వరంగ సంస్థ ఆ పోస్ట్‌లో వివరించింది. దీంతో తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు ఇస్తున్న ప్లాన్‌గా దీన్ని కస్టమర్లు పేర్కొంటున్నారు. మరి ఈ ప్లాన్‌ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) రూ.249 ప్లాన్‌ వ్యాలిడిటీ 45 రోజులు. దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ ఉంటుంది. రోజుకు 2జీబీ చొప్పున 90జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. తక్కువ ధరలో అధిక ప్రయోజనాల కోసం చూసేవారికి ఇది సరిగ్గా సరిపోతుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలు ధరల్ని పెంచిన నేపథ్యంలో రీఛార్జి భారాన్ని తగ్గించుకునేందుకు ఇది సరైన ఎంపిక అని పేర్కొంటున్నారు. అయితే, దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా 5జీ సేవలు ప్రారంభించలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ సేవలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇటీవలే 3జీ నెట్‌వర్క్‌ విస్తరణ మారుమూల గ్రామాలకు చేరింది. ఈ నేపథ్యంలో డేటా వేగం, నెట్‌వర్క్‌ అందుబాటును కూడా యూజర్లు దృష్టిలో ఉంచుకోవాలి.

* అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది. భారతీయ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ భారతీయ రెగ్యులేటరి నోటీసులు జారీ చేసిందని చెప్పింది. సెబీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంలో అర్థంలేనిదంటూ న్యూయార్క్‌కు చెందిన కంపెనీ కొట్టిపడేసింది. భాతర్‌లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు చేసిన అవినీతి, మోసాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే భయపెట్టే ప్రయత్నమంటూ విమర్శించింది. అదానీ గ్రూప్‌ అవకతవకలను బయటపెట్టిన సందర్భంలోనే.. కంపెనీకి సంబంధించిన స్టాక్స్‌ను షార్ట్‌ చేసినట్లు పేర్కొంది. అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్‌ చేసినట్లు వెల్లడించింది. సెబీ షోకాజ్‌ నోటీసుకు ప్రతిస్పందిస్తూ.. ఇక ఈ ఎపిసోడ్‌లో సెబీ షోకాజ్‌ నోటీసుకు ప్రతిస్పందిస్తూ కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరును ప్రస్తావించింది. ఆ బ్యాంకు అదానీ గ్రూప్‌ అవకతవకల వ్యవహారం వెలుగు చూసే సమయంలో ఆఫ్‌షోర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిందని తెలిపింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్‌ను ష్టార్‌ చేశారని.. దాంతో కోటక్‌ బ్యాంకుకు లాభాలు ఏమీ రాలేదని.. సెబీ జారీ చేసిన నోటీసుల్లో ఎక్కడా కోటక్‌ పేరు, బోర్డు సభ్యుల పేర్లు ప్రస్తావించలేదని పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బెంచ్‌ మార్క్‌ సూచీలు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. 80వేల పాయింట్లకు చేరువైన సెన్సెక్స్‌.. కొద్దిసేపటికే ఒక్కసారిగా పతనమైంది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 79,840.37 పాయింట్ల భారీ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సెన్సెక్స్‌ 79,855.87 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్‌ పతనమైంది. ఇంట్రాడేలో 79,231.11 పాయింట్ల కరిష్ఠానికి చేరుకొంది. ఫలితంగా ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరకు 34.73 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 24,236.35 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైకి చేరింది. చివరకు 18.10 పాయింట్లు తగ్గి.. 24,123.85 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,740 షేర్లు పురోగమించాయి. మరో 1,686 షేర్లు పతనం కాగా.. 72 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఎల్‌అండ్‌టీ, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎల్‌ లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్టీ, ఆయిల్ అండ్‌ గ్యాస్ షేర్లు 0.3 శాతం నుంచి ఒకశాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంక్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పవర్ రంగాల షేర్లు 0.3 శాతం నుంచి 0.9 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్‌సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్‌ పేమెంట్స్‌ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2026లో ఇది అందుబాటులోకి రావచ్చన్న అంచనాలున్నాయి. దేశీయ ఫాస్ట్‌ పేమెంట్స్‌ సిస్టమ్స్‌ (ఎఫ్‌పీఎస్‌) ఇంటర్‌లింకింగ్‌ ద్వారా ఓ ఇన్‌స్టంట్‌ క్రాస్‌-బార్డర్‌ రిటైల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధికి బహుళజాతి ఆలోచన ప్రాజెక్ట్‌ అయిన నెక్సస్‌లో భాగస్వామ్యమైనట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌ (బీఐఎస్‌) ఇన్నోవేషన్‌ హబ్‌ కాన్సెప్టే ఈ నెక్సస్‌. దీని ద్వారా తొలుత భారత్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌ దేశాల ఎఫ్‌పీఎస్‌ల అనుసంధానం జరుగుతుందని ఆర్బీఐ వివరించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఆర్బీఐతోపాటు ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు, బీఐఎస్‌ సంతకాలు చేశాయి. మున్ముందు మరిన్ని దేశాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతాయని ఆర్బీఐ చెప్పింది.

* మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మ‌ర్‌(Steve Ballmer).. ప్ర‌పంచ సంప‌న్నుల జాబితాలో ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్‌లో మాజీ సీఈవోగా చేసిన బాల్మ‌ర్ ఇప్పుడు ప్ర‌పంచంలో ఆర‌వ సంప‌న్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా మైక్రోసాఫ్ట్ షేర్లు కొత్త రికార్డులు సృష్టించాయి. ఆ షేర్ల విలువ సుమారు 21 శాతం పెరిగింది. ఓపెన్ఏఐ సంస్థ‌తో ఇటీవ‌ల మైక్రోసాఫ్ట్ ఒప్పందం పెట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇటీవ‌ల ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తోంది. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం.. మైక్రోసాఫ్ట్ షేర్ల‌లో బాల్మ‌ర్‌కు 90 శాతం వాటా ఉన్న‌ది. మ‌రో వైపు బిల్ గేట్స్ మాత్రం త‌న సంప‌ద‌లో కొంత మొత్తాన్ని కాస్‌కేడ్ సంస్థ‌లో ఇన్వెస్ట్ చేశారు. రిప‌బ్లిక్ స‌ర్వీసెస్ కంపెనీలోనూ అత‌ని కొంత వాటా ఉన్న‌ది. అయితే ఇటీవ‌ల దానాల‌తోనూ బిల్ గేట్స్ త‌న సంప‌ద‌ను త‌గ్గించుకున్నారు. వ్య‌క్తిగ‌త సంప‌ద నుంచి బిల్ గేట్స్‌.. త‌న ఫౌండేష‌న్ కోసం విరాళం ఇచ్చేశారు. సుమారు 60 బిలియ‌న్ల డాల‌ర్ల వ్య‌క్తిగ‌త సంప‌ద‌ను ఆయ‌న దానం చేశారు. మిత్రుడు పౌల్ అలెన్‌తో క‌లిసి 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను బిల్ గేట్స్ స్థాపించారు. 2000 సంవ‌త్స‌రంలో బాల్మ‌ర్‌ను ఆ కంపెనీకి సీఈవోగా నియ‌మించారు. 2014లో స్టీవ్ బాల్మ‌ర్ రిటైర్ అయ్యారు. ఆ కంపెనీలో అత‌నికి అత్య‌ధిక సంఖ్య‌లో షేర్లు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z