Politics

అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టిన రేవంత్-NewsRoundup-July 02 2024

అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టిన రేవంత్-NewsRoundup-July 02 2024

* తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 6న జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్టు సమాచారం. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.

* తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్న ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

* రేషన్‌ సరకులు పంపిణీ చేసే వ్యాన్‌లపై మాజీ సీఎం జగన్‌ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఎన్‌పేట మండలం ఎంబరాం గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే వచ్చారు. అదే సమయంలో జగన్‌ చిత్రంతో కూడిన రేషన్‌ సరకుల వాహనం వచ్చింది. అది చూసిన ఎమ్మెల్యే, కారు దిగి వాహనం వద్దకు వెళ్లారు. దొంగల బొమ్మలతో సరకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహించారు. మీ గ్రామంలో ఇంకా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్‌ అందిస్తుంటే ఏం చేస్తున్నారని తెదేపా నాయకులపై కూడా అసహనం చెందారు. అక్కడి నుంచే మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి, తహసీల్దారు రాణి అమ్మాజీతో మాట్లాడించారు. ఎండీఎం ఆపరేటర్, రేషన్‌ డీలరును తొలగించాలని, రెవెన్యూ సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తహసీల్దారు తెలిపారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌ (Hathras) జిల్లాలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రతిభాన్‌పుర్‌లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మహిళలు చిన్నారులు ఉన్నారు. వెంటనే వారిని దగ్గర్లోని ఇటా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు 27 మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. గాయపడినవారికి చికిత్స అందుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి’’ అని ఇటా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ఉమేశ్‌ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి, సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.

* దక్షిణ గాజాలోని (South Gaza) ఖాన్‌ యూనిస్‌ (Khan younis) నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్‌ (Hamas) ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు (Israel Army) మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్‌ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా సామన్య ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్‌ యూనిస్‌ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు పాల్పడటం గమనార్హం.

* నీట్‌ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్‌ పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నీట్‌ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, పరీక్షలో అక్రమాలకు తావులేకుండా ఉండేలా చివరి గంటల్లోనే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారట..! జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్‌ షెడ్యూల్‌ను మంగళవారం (జులై 2న) ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పరీక్ష తేదీని నేడు వెల్లడించలేమని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) సీనియర్‌ అధికారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం తాము సిద్ధం చేసిన ప్రణాళికను కేంద్రం ఇంకా ఆమోదించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

* వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైకాపా ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా’’ అని శబరి విజ్ఞప్తి చేశారు.

* వైకాపా హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్‌ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తాజాగా, సోమవారం రాత్రి జగన్‌ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్‌ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్‌ బుల్లెట్లను క్రేన్‌ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్‌తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్‌ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్‌పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.

* తెలుగు సినీ పరిశ్రమ సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ, సామాజిక సమస్యలైన సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది. నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్‌ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ నియంత్రణకు కృషి చేస్తూ ఒక వీడియో చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్‌తో ఆ వీడియో రూపొందించాలి. ఇది కచ్చితమైన షరతు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద వాళ్లు వచ్చి రిక్వెస్ట్‌ చేసినా సరే, ఆ మూవీ తారగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వండి. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం. డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వ నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. ఇదొక్కటే మా కండీషన్‌. సినిమా షూటింగ్‌ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్‌శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’.

* అమెరికా(USA)లో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్‌ మోసాలకు పాల్పడినట్లు ఈసందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఔట్‌కమ్‌ హెల్త్‌ పేరిట రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్‌ మీడియా సంస్థను 2006లో ఏర్పాటుచేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పేషెంట్లను టార్గెట్‌ చేసుకొని వివిధ కంపెనీల మెడికల్‌ అడ్వర్టైజింగ్‌ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు లభించాయి. 2010లో ఆ దేశ టెక్‌, హెల్త్‌కేర్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గోల్డ్‌మన్‌ సాక్స్‌, ఆల్ఫాబెట్‌, జేబీ ప్యాట్రిక్స్‌ వెంచర్‌ క్యాపిటల్స్‌ వంటి సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు చేశాయి. చికాగో కార్పొరేట్‌ సర్కిల్స్‌లో షా అప్పట్లో ఓ స్టార్‌ అయిపోయాడు. కానీ, రిషి, శ్రద్ధా, సీఎఫ్‌వో బ్రాడ్ పౌర్డీలు కంపెనీ ఆపరేషనల్‌, ఫైనాన్షియల్‌ కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లు గుర్తించారు. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. ఫార్మా జెయింట్‌ నోవో నార్డ్‌స్క్‌, మరికొన్ని కంపెనీలు ఈ అంశాన్ని గుర్తించాయి. మరోవైపు షా విలాసవంతమైన జీవనశైలి ఇన్వెస్టర్లలో అనుమానాలు పెంచింది. అతడు 10 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఇల్లు కొనుగోలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ 2017లో కథనం ప్రచురించింది. ఆ తర్వాత గోల్డ్‌మన్‌ సాక్స్‌, ఆల్ఫాబెట్‌ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు ఫైల్‌ చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాననంటే ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది.

* బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప‌ల్లెల ప్ర‌గ‌తికి నెలకు రూ. 275 కోట్లు, ఏడాదికి రూ. 3,330 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ఈ నిధుల‌న్నింటిని పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్న ఒక్క రూపాయి కూడా గ్రామ‌పంచాయ‌తీల‌కు కేటాయించ‌లేదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

* హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్‌ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌స్టేషన్లలో టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 5వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్‌ (లోప్రెజర్‌), జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్‌, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నల్లగండ్ల, చందానగర్‌, హుడా కాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి అంతరాయం ఉంటుందన్నారు.

* కాంగ్రెస్‌ గూండాగిరికి భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపల్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ శ్రేణులు మున్సిపల్‌ వైస్‌ చైర్స్‌పర్సన్‌ వాణీ వీరారెడ్డిపై దాడి చేశారు. ఈ క్రమంలో సోమవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ వాణీ వీరారెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు.

* లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ పలు అంశాలపై ప్రసంగించారు. ప్రజలు తమ పాలన, ట్రాక్‌ రికార్డు చూశారని చెప్పారు. తమ పదేండ్ల హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z