* మహారాష్ట్రలోని పుణె సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా 27 ఏళ్లలోపు వారే. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖురేషీ, రఫీక్ ఖురేషీ, ఫిరోజ్ ఖురేషీ, కంగ్టి గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖురేషీ, వెంకటాపూర్‌కు చెందిన సయ్యద్ అమర్, సిర్గాపూర్ గ్రామానికి చెందిన మజీద్ పటేల్ రాజస్థాన్‌లోని అజ్‌మేర్ దర్గాకు ఆదివారం కారులో వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం పుణె సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో మహబూబ్, రఫీక్, ఫిరోజ్, మజీద్ పటేల్, ఫిరోజ్ ఖురేషీ(కంగ్టి) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ అమర్ పుణె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
* ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసుదత్త అనే యువకుడు తమ ఇంటికి సమీపంలో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఇటీవల పెన్న అహోబిలంలో ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతి.. వాసుదత్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ప్రేమను నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన వాసుదత్త అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* క్షణికావేశంలో భర్తను భార్య చంపేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడికి చెందిన జి.అప్పారావు (30) మద్యం మత్తులో భార్య కీర్తనతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కీర్తన.. స్క్రూడ్రైవర్‌తో అప్పారావు మెడపై పొడిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. బంటుమిల్లి ఎస్సై జి.వాసు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
* పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహం.. ఘట్‌కేసర్ వరకు సుమారు 5 కి.మీ వేలాడుతూ వచ్చింది. అక్కడి రైల్వేగేటు వద్ద రైలు ఇంజిన్‌కు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘట్‌కేసర్ దాటాక రైలు ఆపించిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది.. మృతదేహాన్ని తొలగించారు. మృతిచెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
* వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
* భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారి రియాన్షిక సోమవారం మంచంపై ఆడుకుంటుండగా కిందపడింది. దీంతో ఆమె చేతిలో ఉన్న పెన్ను ఎడమ చెవిపైన తలకు గుచ్చుకుంది. దాదాపు సగం పెన్ను చిన్నారి తలలోకి పోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిండ్రులు చిన్నారిని భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ న్యూరోసర్జన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఖమ్మం తరలించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన వైద్యులు తలలోకి దిగిన పెన్నును తొలగించారు. సర్జరీ తర్వాత బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ కావడంతో చిన్నారి ఆరోగ్యం విషమించింది. దీంతో బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z