Politics

జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం-NewsRoundup-July 03 2024

జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం-NewsRoundup-July 03 2024

* ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ కేసులపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్‌ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

* సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

* శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తితిదే తెలిపింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని తితిదే నిర్ణయించినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. కానీ.. అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు తితిదే సూచించింది.

* టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ వైస్‌కెప్టెన్‌ తస్కిన్‌ అహ్మద్‌ ఆడలేదు. కీలక మ్యాచ్‌లో అతడు దూరం కావడానికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతిగా నిద్రపోయి.. సమయానికి బస్సు అందుకోలేకపోవడం వల్లనే అతడు తుది జట్టులో ఆడలేదని ఓ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధికారి చెప్పాడు. ‘‘జట్టు బస్సు అందుకోలేకపోయిన తస్కిన్‌ ఆ తర్వాత జట్టుతో చేరాడు’’ అని బీసీబీ అధికారి చెప్పాడు. ‘‘బస్సు అందుకోలేకపోయినందుకు తోటి ఆటగాళ్లతో పాటు అందరికీ తస్కిన్‌ క్షమాపణలు చెప్పాడు. దీన్నో సమస్యగా చూడాల్సిన అవసరం లేదు’’ అని బీసీబీ అధికారి అన్నాడు. అంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 50 పరుగులు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

* పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఇతర విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ప్రధాని మోదీ (Modi) ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య ప్రసంగాన్ని కొనసాగించారు. ఈనేపథ్యంలో మోదీ, రాహుల్ లోక్‌సభలో వ్యవహరించిన తీరును చూపిస్తూ భాజపా కొన్ని దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వీటిని చూస్తే నియంతలా ప్రవర్తించేది ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించింది.

* ఝార్ఖండ్‌ (Jharkhand)ముఖ్యమంత్రిగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఆయన్ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలులో ఉన్న ఆయన జూన్‌ 28న విడుదలైన నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు బుధవారం రాంచీలో ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్‌ నివాసంలో భేటీ అయ్యారు. మళ్లీ హేమంత్‌ సీఎంగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి గులాం అహ్మద్‌ మీర్‌, ఆ పార్టీ అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌, ఆయన సోదరుడు సోదరుడు బసంత్‌ కూడా ఉన్నారు.

* ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలో పెనువిషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందగా.. వీరిలో ఆరుగురు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం వెల్లడించారు. ఆరుగురు మృతుల్లో హరియాణా నుంచి నలుగురు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరుపుతామని ప్రకటించారు. న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగంగా ఉంటారని తెలిపారు. ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు.

* టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) కుటుంబం దిగిన ఫొటోలు ఓ నకిలీ ఖాతా ద్వారా నెట్టింట వైరల్‌గా మారాయి. తన పేరుతో ఫేక్‌ అకౌంట్‌ సృష్టించడంపై బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ (Sanjana Ganesan) తీవ్రంగా స్పందించారు. సమాచారాన్ని దొంగలించారంటూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఫైర్‌ అయ్యారు. ‘‘మా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని దొంగలించి అచ్చం నా ఖాతా లాంటి మరో ఫేక్‌ అకౌంట్‌ను సృష్టించారు. వెంటనే దీన్ని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఆమె పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

* కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన భారాస నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

* ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు.

* రామ్ చరణ్‌ దంపతులు ఇచ్చిన మాటతో తన సంతోషం వెయ్యి రెట్లైందన్నారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. డ్యాన్సర్స్‌ యూనియన్‌లోని కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చినట్లు తెలిపారు. దీనిపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

* టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ రెండోసారి విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. పొట్టి కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని పాకిస్థాన్‌ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు

* ‘మణిపుర్‌’ అంశం (Manipur Issue)పై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తోన్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దీనిపై స్పందించారు. ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు హితవు పలికారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు.. యావత్‌ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి.. చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు.

* కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈనేపథ్యంలో వ్యక్తిగత, ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం నాగ్‌పుర్‌లో పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z