Politics

ఏపీకి చేయూతనందించవల్సిందిగా మోదీకి బాబు వినతి

గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల దుష్పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు. వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానమంత్రితోపాటు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఇంధనశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, దానికితోడు గత ఐదేళ్ల జగన్‌ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ దారుణంగా దెబ్బతిన్నట్లు వివరించారు. అనుత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ, మానవవనరుల అభివృద్ధిని గాలికొదిలేయడంతో అభివృద్ధి అడుగంటిపోయినట్లు చెప్పారు. ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్నంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని, దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేసిందని, దానికితోడు ప్రజాధనాన్ని పెద్దఎత్తున దారి మళ్లించిందని చెప్పారు. ఫలితంగా ప్రజావసరాలు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z