Business

భారత్‌లో 9.2శాతానికి నిరుద్యోగిత-BusinessNews-July 04 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే రికార్డు లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో గురువారం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ జీవనకాల గరిష్ఠాల వద్ద వరుసగా నాలుగో రోజూ సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం.

* ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగింది. మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరింది. ఇది 8 నెలల గరిష్ఠం అని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహసర్వేలో బహిర్గతమైంది. గతేడాది జూన్‌లో నమోదైన 8.5 శాతంతో పోలిస్తే అధికంగా ఉందని వెల్లడించింది.

* టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup) గెలిచిన టీమ్‌ఇండియా గురువారం ఉదయం భారత్‌కు చేరుకుంది. భీకర హరికేన్‌ కారణంగా వారు బార్బడోస్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియాకు (Air India) చెందిన ప్రత్యేక విమానాన్ని పంపి బీసీసీఐ వారిని స్వదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ విమానానికి సంబంధించిన అంశం కాస్త వివాదంగా మారింది. అది ముందుగా ప్రయాణికుల కోసం కేటాయించిందని.. దాన్ని రద్దు చేసి బార్బడోస్‌కు పంపారని బుధవారం వార్తలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. దీన్ని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను (Air India) ఆదేశించింది.

* ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ (Bajaj CNG Bike) విడుదలకు సిద్ధమైంది. భారత మార్కెట్లోకి బజాజ్‌ కంపెనీ దీన్ని జులై 5న విడుదల చేయనుంది. పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వాహనదారులకు.. సీఎన్‌జీ బైక్‌ వస్తోందన్న ప్రకటన ఆశలు రేపింది. దీంతో బైక్‌ ప్రియులు దీనికోసం కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బైక్‌ విడుదలకు ముందు కంపెనీ కొన్ని వివరాలను టీజ్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేయగా.. మరికొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి.

* భారత్‌.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని ఎన్‌సీఏఈఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తా అన్నారు. దేశ జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు. అయితే చాలావరకు రుణాలు స్థానిక కరెన్సీ అయిన రూపాయల్లోనే ఉండటం, దేశ వృద్ధిరేటు కూడా ఆకర్షణీయంగా ఉన్న కారణంగా ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌సీఏఈఆర్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గుప్తా మాట్లాడుతూ.. మొత్తం అప్పుల్లో మూడింటా ఒక వంతు రాష్ర్టాలవని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో రుణ భారం మరింతగా పెరిగేందుకు వీలుందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల రాష్ర్టాలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z