రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్‌లో రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు.
వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z