Business

ఎయిర్‌టెల్ లీక్ నిజం కాదు-BusinessNews-July 05 2024

ఎయిర్‌టెల్ లీక్ నిజం కాదు-BusinessNews-July 05 2024

* రచయిత్రి, వితరణశీలిగా సుపరిచితురాలైన సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభ ఎంపీగా కొత్త బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పెద్దల సభలో ఆమె చేసిన తొలి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై గళం వినిపించిన ఆమెకు స్వయంగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ సుధామూర్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా కన్పిస్తారు. ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య అయిన ఆమె.. గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదంటే మీరు నమ్ముతారా? అదే నిజమంటున్నారామె..! అందుకు కారణం తన కాశీ (Kashi) యాత్రేనని చెప్పారు. ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులోనే కన్పించే సుధామూర్తి (Rajya Sabha MP Sudha Murty) ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన షాపింగ్‌కు సంబంధించి ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ‘‘కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి మనకు నచ్చింది వదిలేస్తే మంచిదనే సంప్రదాయం ఉంది. నాకు షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఓ సారి వారణాసి వెళ్లినప్పుడు గంగా నదిలో నేను షాపింగ్‌ని వదిలేశా. మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా. అలా గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదు. ఉన్న వాటినే మళ్లీ మళ్లీ కడుతున్నా. మా తల్లిదండ్రులు, తాతముత్తాలు ఉన్నంతలో పొదుపుగా జీవించారు. వారి నుంచే నాకు ఈ నిరాడంబరత అలవాటైంది. మా అమ్మ కబోర్డులో కేవలం 8-10 చీరలే ఉండేవి. మా బామ్మ దగ్గర నాలుగే ఉండేవి. నేను కూడా వారిలాగే పొదుపుగా జీవించాలనుకున్నా’’ అని ఆమె చెప్పారు.

* నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఇండియన్‌ ఫార్మాస్యుటికల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్‌ఆర్‌ వెలుపల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని తెలిపారు.

* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ను ఓ వివాదం చుట్టుముట్టింది. దాదాపు 37.5 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు (Airtel Data Leak) హ్యాకింగ్‌కి గురైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిని ఎయిర్‌టెల్‌ తీవ్రంగా ఖండించింది. ‘xenZen’ పేరుతో ఉన్న హ్యాకర్.. ఓ డేటాబేస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచాడు. దాన్ని ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు సంబంధించిన డేటాగా (Airtel Data Leak) పేర్కొన్నాడు. దాంట్లో యూజర్ల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, చిరునామా, ఈమెయిల్‌ ఐడీ తదితర వివరాలు ఉన్నాయని తెలిపాడు. కావాల్సిన వారు 50 వేల డాలర్లు చెల్లించి యాక్సెస్‌ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ డేటా బేస్‌లో నిజంగానే కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్నాయా? అనేది ఎవరూ ధ్రువీకరించలేదు.

* ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG) బైక్‌ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj auto) శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్‌ 125 (Freedom 125) పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్‌ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్‌ ఊరటనిస్తుందని బజాజ్‌ ఆటో తెలిపింది. దీని ధర, మైలేజీ ఇతర వివరాలు. ఫ్రీడమ్‌ 125 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ (Freedom 125) డిస్క్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌తో ఏడు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుందని తెలిపింది. ఇందులో డిస్క్‌ ఎల్‌ఈడీ వేరియంట్‌ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్‌ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.95వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z