Business

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు RBI జరిమానా-BusinessNews-July 06 2024

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు RBI జరిమానా-BusinessNews-July 06 2024

* ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) జరిమానా విధించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు గానూ పీఎన్‌బీపై రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో పీఎన్‌బీ విఫలమైందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

* ఇటీవల టెలికాం ఛార్జీలను సవరించిన జియో.. కొత్తగా 5జీ డేటా బూస్టర్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్‌ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. వారు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు. కొత్త ప్లాన్లు తీసుకురాక ముందు 5జీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 5జీ మొబైల్‌ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను జియో అందించేది. ప్లాన్ల సవరణ తర్వాత 2జీబీ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అనే షరతు విధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌ సెక్షన్‌లో వీటిని పొందుపరిచింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియోను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్లు సమీకరించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇదే నిలుస్తుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది.

* మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్‌ సిన్హా సూచించారు. పైవంతెనలు, ఆనకట్టలను కాంక్రీటుతో నిర్మించేందుకు 4-5 ఏళ్లు పడుతుందని, స్టీల్‌ నిర్మాణాలతే.. నాలుగైదు నెలల్లోనే పూర్తి చేయొచ్చని వివరించారు. సాగునీటి కాలువల నిర్మాణంలోనూ ఉక్కు పైపులను వినియోగిస్తే, నీటి వృథాను అరికట్టడంతో పాటు, భూసేకరణ సమస్యనూ అధిగమించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్టీల్‌ ఇన్‌ఫ్రా బిల్డ్‌’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో స్టీల్‌ ఫ్రేమ్స్‌ వినియోగం 40-50% ఉంటే, మన దేశంలో 2 శాతమే ఉందన్నారు. స్టీల్‌ పరిశ్రమకు తమ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని, దృశ్య మాధ్యమ పద్ధతిలో ప్రసంగించిన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

* భారత్‌లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) రిటైల్‌ విక్రయాలు జూన్‌లో నెమ్మదించాయి. తీవ్ర వేడి, ఉక్కబోత కారణంగా షోరూములకు ప్రజలు 15% తక్కువగా రావడమే ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా పేర్కొంది. 2023 జూన్‌లో 3,02,000 పీవీలకు ఆర్‌టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరగ్గా, గత నెలలో 7% తక్కువగా 2,81,566 పీవీలే రిజిస్టర్‌ అయ్యాయని తెలిపింది. దేశంలో 1700 ఆర్‌టీఏ కార్యాలయాలుండగా, 1567 కార్యాలయాల నుంచి సేకరించిన వివరాలతో ఫాడా ఈ నివేదిక రూపొందించింది.

* అదానీ గ్రూప్‌ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. హిండెన్‌బర్గ్‌ సదరు నివేదిక రూపొందించేలా, చైనాతో సంబంధమున్న ఒక వ్యాపారవేత్త చర్యలు తీసుకున్నారని.. సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ ఆరోపించారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఒక నివేదిక రూపొందించాలంటూ, న్యూయార్క్‌ హెడ్జ్‌ ఫండ్‌ అయిన కింగ్డన్‌ క్యాపిటల్‌కు చెందిన మార్క్‌ కింగ్డన్‌ అనే అమెరికా వ్యాపారవేత్త.. హిండెన్‌బర్గ్‌కు బాధ్యత అప్పగించినట్లు జెఠ్మలానీ తెలిపారు. విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థ కింగ్డన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్, అనుబంధ సంస్థలు కలిసి.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లలో పరోక్షంగా ట్రేడింగ్‌ చేసేందుకు హిండెన్‌బర్గ్‌కు సహకరించాయని ఈ వారం మొదట్లో మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చైనా బిడ్లకు పోటీగా వెళ్లిన అదానీ సంస్థలు కొన్నింటిని చేజిక్కించుకోవడం వల్లే, అదానీ గ్రూప్‌పై చైనా దృష్టి పెట్టిందనీ జెఠ్మలానీ ఎక్స్‌ పోస్టులో వివరించారు.

* జులై ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.710 పెరిగి పసిడి ప్రియులకు మళ్ళీ షాకిచ్చింది. దీంతో ఈ రోజు (జులై 6) ధరలు మళ్ళీ పెరిగాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగినట్లు స్పష్టమవుతోంది.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం భారీగానే పెరిగాయి. నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది. అంటే ఈ రోజు ధరలు రూ. 650, రూ. 710 పెరిగాయి.చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ. 600 (22 క్యారెట్స్, 10 గ్రామ్స్), రూ. 650 (24 క్యారెట్స్, 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.

* 2047 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుంది, అయితే అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారదని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌గా అవరిస్తుందన్న ప్రధాని మోదీ కల నెరవేరడం అసాధ్యమని ఆయన అన్నారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మార్టిన్ వోల్ఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్​ మార్కెట్ల వృద్ధి నెమ్మదిగా ఉండటం మాత్రమే కాకుండా, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా భారతదేశ ఎదుగుదల కష్టతరం అవుతుందని అన్నారు. కానీ ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తాయని.. అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తరువాత భారత్ ఆర్థికంగా కూడా ఎదుగుతుందని ఆయన అన్నారు.ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. దీనికోసం కేంద్రం విజన్ డాక్యుమెంట్‌పై పని చేస్తోంది. ఇండియా అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారటానికి ప్రతి వ్యక్తి జీడీపీ సంవత్సరానికి 7.5 శాతానికి చేరుకోవాలి. అప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని వోల్ఫ్ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z