* ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారంటూ గుడివాడ రెండో పట్టణ పీఎస్‌లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగులకొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్దిరోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్ తెలిపారు.
* దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను (Uttarakhand) వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలో (Landslides) హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు (Hyderabad Tourists) మృతిచెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు (Landslides) విరిగి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* అవినీతి ఆరోపణలతో గుంతకల్లు డీఆర్‌ఎం సీబీఐ అధికారులకు చిక్కారు. గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే లైన్ల అభివృద్ధికి జరుగుతున్న పనుల్లో గుత్తేదారుల నుంచి లంచం తీసుకుంటూ పలువురు అధికారులు పట్టుబడ్డారు. గుంతకల్లు డివిజన్‌లో రూ.500 కోట్లతో గతిశక్తి పథకంలో రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు చేస్తున్న గుత్తేదారుల నుంచి గుంతకల్లు రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారులు భారీగా లంచం డిమాండ్ చేశారు. లంచంతో పాటు స్టార్ హోటళ్లలో విలాసవంతమైన గదులు, భారీ పార్టీలకు కాంట్రాక్టర్లతో ఖర్చు పెట్టిస్తూ బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
* నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్ కేసు నమోదైంది. కమిషనర్ వికాస్ మర్మత్‌తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనపై కేసులు నమోదు చేశారు. కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో గత పది రోజులుగా విచారణ కొనసాగింది. ఆరుగురు కార్పొరేటర్లు, మేయర్ భర్త జయవర్ధన్, ఉద్యోగులపై దర్యాప్తు సాగింది. ఇందులో 70 దస్త్రాలకు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.
* మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ.. తొర్రూరు నుంచి బీరిశెట్టిగూడెం వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌తో కలిసి ఆరుగురు ప్రయాణిస్తున్నారు. దంతాలపల్లి శివారు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బీటీ దెబ్బతినడంతో మరమ్మతుల కోసం తవ్వి వదిలేసిన గుంత వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ఈ గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారును ఢీకొంది. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో తొర్రూరు మండలం వెల్లికట్టకు చెందిన ఆటో డ్రైవర్ మల్లేశ్ (38), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన పగిండ్ల కుమార్(38), వాల్యాతండాకు చెందిన భూక్యా నరేష్(28) అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఆటోలో ఉన్న కుమార్ భార్య మంజుల, కుమార్తె అంజలి తీవ్రంగా గాయపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z