Business

పక్కనోడితో పోల్చుకుని పెట్టుబడులు పెట్టకండి-BusinessNews-July 07 2024

పక్కనోడితో పోల్చుకుని పెట్టుబడులు పెట్టకండి-BusinessNews-July 07 2024

* ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్‌ మార్కెట్, ఇటు బంగారం (Gold) సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 50కి మించి సంప్రదాయ పెట్టుబడి సాధనమైన పసిడి (Gold) అధిక ప్రతిఫలాలను ఇవ్వడమే ఇక్కడ విశేషం. జనవరి-జూన్‌లో నిఫ్టీ-50 సూచీ 11% లాభపడితే.. బంగారం 14% ప్రతిఫలాలను మదుపర్లకు అందించింది.

* ప్రతిష్ఠాత్మక పథకం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా (AB PMJAY) లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయడం ద్వారా దీన్ని ప్రారంభించనుంది. అలాగే బీమా హామీ మొత్తాన్ని సైతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఖజానాపై ఏటా మరో రూ.12,076 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా సమాలోచనలు జరుపుతోందని తెలిపారు. ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే దేశంలో మూడింట రెండొంతుల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల హామీ మొత్తం లభిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రూ.10 లక్షలకు పెంచే విషయాన్ని కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

* గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.83 లక్షల కోట్లు వృద్ధి చెందింది. దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 963.87 పాయింట్లు (1.21 శాతం) లబ్ధి పొందింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,894.44 కోట్లు పెరిగి రూ.14,51,739.53 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.33,320.03 కోట్ల వృద్ధితో రూ.6,83,922.13 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,611.36 కోట్లు పుంజుకుని రూ.21,51,562.56 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.23,676.78 కోట్ల లబ్ధితో రూ.8,67,878.66 కోట్ల వద్ద నిలిచింది.

* బాబాయి కొడుకు ఇల్లు కొన్నాడనో, చిన్నమ్మ కూతురు ప్లాటు కొన్నదనో ఆస్తి కొనుగోలుకు పూనుకోవద్దు. ఇంటి ఖరీదులో 20 శాతం డౌన్‌ పేమెంట్‌, రిజిస్ట్రేషన్‌ సొమ్ము చేతిలో లేకుండా ఇంటికి ప్లాన్‌ చేయొద్దు. లక్ష రూపాయల జీతగాడు రూ.60 లక్షలు విలువజేసే ఫ్లాట్‌ కొన్నాడనుకుందాం. అతను తీసుకునే రుణం 50 లక్షల లోపే ఉండాలి. అలాకాకుండా రూ.50 లక్షలు ఇంటి రుణం, డౌన్‌ పేమెంట్‌, రిజిస్ట్రేషన్‌ ఖర్చులకు రూ.20 లక్షలు పర్సనల్‌ లోను తీసుకుంటే.. అతని జీతంలో రూ.80 వేలు ఈ రెండు వాయిదాలకే సరిపోతుంది. ఈఎమ్‌ఐలు చెల్లించడానికే జీవితమంతా ఖర్చయిపోతుంది.

* కాకలు తీరిన ఆర్థికవేత్తలు కూడా కొన్నిసార్లు పెట్టుబడి దోవలో పక్కదారి పడుతుంటారు. బీకామ్‌లు, సీఏలు చదవని వ్యక్తుల మాటేమిటి? దండిగా సంపాదించే ఉద్యోగంలో కుదురుకోగానే ఏదో ఇన్వెస్ట్‌ చేయాలన్న తపన పుడుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిదే! కానీ, భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోకుండా చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ అక్కరకు రాని చుట్టం లాంటిదే! అందుకు ఉదాహరణే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సామ్యూల్‌ కథ. ఇంజినీరింగ్‌ అయిపోగానే అతనికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేండ్లు తిరిగేసరికి మంచి హైక్‌ మీద వేతనం అమాంతం పెరిగింది. మ్యూచువల్‌ఫండ్స్‌ ఎస్‌ఐపీ కట్టడం మొదలుపెట్టాడు. ఎనిమిదేండ్లు గడిచాయి. 22 శాతం వరకు రిటర్న్స్‌ వస్తున్నాయని పొంగిపోయాడు. సామ్యూల్‌కు కొత్త ఆలోచన రాకపోతే.. అతని పెట్టుబడి పక్కాగా మేలైన ఫలితాన్నే ఇచ్చేది. సజావుగా సాగుతున్న సామ్యూల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికను రాజారామ్‌ సలహా భగ్నం చేసింది. అతగాడు ప్లాటు కొన్నానని, విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్నేహితుడితో చెప్పాడు. ఆ మాట విన్నప్పటి నుంచి సామ్యూల్‌ బుర్రను పురుగు తొలచడం మొదలైంది. అదేరోజు రాత్రి రాజారామ్‌కు ఫోన్‌ చేసి.. అతను ప్లాట్‌ తీసుకున్న వెంచర్‌లో మరేదైనా ప్లాట్‌ ఉందేమో అడిగాడు. ఉందన్నాడు రాజారామ్‌. మర్నాడు స్నేహితుడితో వెళ్లి ప్లాట్‌ చూసొచ్చాడు. వాస్తు బాగుంది. పెట్టిన రూపాయికి మరో రూపాయి లాభం వస్తుందని నమ్మాడు. ప్లాట్‌ కొనడానికి సరిపడా డబ్బులు లేవు. ఎనిమిదేండ్లుగా సిస్టమేటిక్‌గా కూడబెట్టిన మ్యూచువల్‌ఫండ్స్‌ను బ్రేక్‌ చేసి ఆ మొత్తాన్ని ప్లాట్‌ కొనుగోలుకు వెచ్చించాడు. ఆరేండ్లు గడిచాయి. ఆ ప్లాట్‌ అమ్మకానికి పెట్టాడు సామ్యూల్‌. పెట్టిన పెట్టుబడికి రెండింతలు వచ్చింది. పొంగిపోయాడు. కొలీగ్స్‌కు పార్టీ ఇచ్చాడు. ఈ పెట్టుబడి స్టోరీ ఇక్కడికి ముగిసిపోలేదు. అంతలా పొంగిపోతున్న సామ్యూల్‌ వారం తర్వాత ఓ ఆర్థికవేత్తను కలిశాడు. ఆయనేదో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చెబుతుంటే.. భూమ్మీద పెడితే ఢోకా ఉండదనీ, ఆరేండ్లలో నాకు రూపాయికి రెండు రూపాయలు గిట్టుబాటు అయిందని చెప్పుకొచ్చాడు. ‘డబుల్‌ అవ్వడం బాగానే ఉంది.. రిటర్న్స్‌ ఎంత వచ్చాయో చెబుతారా?’ అని అడిగాడు ఆర్థికవేత్త. ఎలా లెక్కించాలో తెలియక తికమకపడుతున్న సామ్యూల్‌తో.. పన్నెండు శాతం అన్నాడు. ‘అంతేనా!’ అన్నట్టుగా చూశాడు. 18 నుంచి 20 శాతం రిటర్న్స్‌ వస్తున్న మ్యూచువల్‌ఫండ్స్‌ మొత్తాన్ని తీసుకొని.. కొన్న స్థలం మీద తనకు వచ్చింది పన్నెండు శాతం లాభమేనని తెలిసి అవాక్కయ్యాడు సామ్యూల్‌. అక్కడితో కథ ఒడిసినా బాగుండేది. అతని ప్లాట్‌ కొన్న వ్యక్తి సగం సొమ్ము చెక్కు రూపంలో ఇచ్చాడు. మిగతా సగం నగదుగా చెల్లించాడు. తను వైట్‌ మనీతో కొన్న ప్లాటు అమ్మితే వచ్చిన లాభం అంతా బ్లాక్‌ మనీగా చేతికి అందింది. ఆ మొత్తాన్ని వైట్‌గా ఎలా మార్చుకోవాలో తెలియక రోజుల తరబడి సతమతమయ్యాడు.ఒక సామ్యూల్‌ కథ చదివి భూముల మీద పెట్టుబడి పెట్టొద్దని నిర్ణయానికి వస్తే.. మళ్లీ పొరబాటు పడ్డట్టే! ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి ఆస్తీ మీ భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేదై ఉండాలి. ఈ ఆస్తి ఉద్దేశం ఇది.. ఈ పెట్టుబడి లక్ష్యం ఇది.. ఇలా దేనికదే పక్కాగా ప్రణాళిక చేసుకోవాలి. ఈ పొలం రిటైర్మెంట్‌ ప్లాన్‌ కోసం, ఈ మ్యూచువల్‌ఫండ్స్‌ కూతురు మెడిసిన్‌ కోసం, ఈ ఎఫ్‌డీ కొడుకు సెటిల్‌మెంట్‌ కోసం.. ఇలా ప్లాన్‌ చేసుకుంటే.. ఎందులో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలో తెలుస్తుంది. ఆస్తుల విషయంలో ఎదుటివారిని చూసి కాపీ కొట్టినా, భావోద్వేగాలకు లోనైనా.. ప్రయోజనం నెరవేరదు. మీకు అలాంటి చికాకులు రావొద్దంటే.. పెట్టుబడి బాటలో పద్ధతిగా నడవండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z