ఆహార పదార్థాలకు సంబంధించి సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టు పురుగులు, మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఆమోదం తెలిపింది. తాజా పరిణామం అక్కడ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న హోటల్ రంగానికి ఎంతో ఊతమిచ్చినట్లయ్యింది. ‘‘వివిధ జాతులకు చెందిన కీటకాలు, వాటి సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై ఎటువంటి నియంత్రణ లేదు. ఈ కీటకాలను మానవ వినియోగానికి లేదా జంతువుల పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అని సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ ప్రకటించింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు.. చైనా, థాయిలాండ్, వియత్నాం నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. స్థానికంగా పెంచిన లేదా దిగుమతి చేసుకున్న కీటకాలు కచ్చితంగా నిబంధనలకు లోబడే ఉండాలని ఎప్‌ఎఫ్‌ఏ స్పష్టం చేసింది. ముఖ్యంగా అవి అడవుల నుంచి సేకరించినవి కాకుండా ఉండాలని సూచించింది. సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ తీసుకున్న నిర్ణయంతో అనేక రెస్టరంట్లు, కేఫ్‌ల్లో జోష్ నెలకొంది. కొత్త రుచులతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో మిడతలు, గొల్లభామల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని స్థానిక మీడియా పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z