Health

విజయవాడలో కిడ్నీ రాకెట్-CrimeNews-July 08 2024

విజయవాడలో కిడ్నీ రాకెట్-CrimeNews-July 08 2024

* ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్‌ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్‌ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్‌ శర్మను అరెస్ట్‌ చేసి ధన్వంతరి ఫౌండేషన్‌ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్‌ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్‌ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

* ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్‌పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది.అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.

* విజయవాడలో కిడ్నీ రాకెట్‌ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది. దీంతో బాధితుడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు. మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్‌ తర్వాత మధు బాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్‌ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

* హర్యానా (Haryana) రాష్ట్రం పంచకుల (Panchkula)లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గాయాలపాలయ్యారు (Children Injured). పింజోర్‌లోని నౌల్టా గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ నగరంలోని పింజోర్‌ ఆసుపత్రి, సెక్టార్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పీజీఐ చండీగఢ్‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు బస్సులో ఓవర్‌లోడ్‌, రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి దారితీసిన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

* ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలిక హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టారు. 20కి పైగా బృందాలతో బస్‌ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉండి మరీ నిందితుడి కోసం వెతుకుతున్నారు. అయితే నిందితుడు ఫోన్‌ వాడకపోవడంతో ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో గతంలో ఎవరెవరితో మాట్లాడాడో కాల్‌ డేటా ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వైజాగ్‌ జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z