Videos

తండ్రీ కూతుళ్ల బంధంపై యూట్యూబర్ అసభ్య మీమ్‌లు. ఖండించిన పలువురు సినీప్రముఖులు.

తండ్రీ కూతుళ్ల బంధంపై యూట్యూబర్ అసభ్య మీమ్‌లు. ఖండించిన పలువురు సినీప్రముఖులు.

సామాజిక మాధ్యమాల వేదికగా చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమంటూ సినీతారలు గళమెత్తుతున్నారు. తండ్రీ-కూతుళ్ల బంధంపై సామాజిక మాధ్యమాల వేదికగా ద్వందార్థాలతో కొందరు వ్యక్తులు మాట్లాడం హేయమంటూ నటులు సాయితేజ్‌, మంచు మనోజ్‌ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా మరికొందరు సినీతారలు తమ గళాన్ని వినిపించారు. తాజాగా సినీ నటులు కార్తికేయ, ఖుష్బూ, విశ్వక్‌సేన్‌, సుధీర్‌బాబు తదితరులు స్పందించారు.

*** ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాల్సింది కాదు: కార్తికేయ
‘‘చిన్న పిల్లలపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ పరిధులు దాటి ప్రవర్తిస్తున్న ఓ యూట్యూబర్‌ విషయంలో నా అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఈ ఒక్క సందర్భమే కాదు, ఇతరులపై ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడటం ఈ రోజుల్లో ట్రెండ్‌ అయిపోయింది. అదేమంటే ‘మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము అలా మాట్లాడుతున్నాం’ అంటున్నారు. ఇలా మాట్లాడే ఈ స్థాయికి దిగజారిపోయారు. ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు. సద్విమర్శలు, ఆహ్లాదకరమైన జోక్‌లు ఎప్పుడూ మంచివే. ఎదుటి వ్యక్తిని కించపరిచే వ్యాఖ్యలే మనల్ని సమాజం నుంచి మరింత వెనక్కి తీసుకెళ్తాయి. ఒకరినొకరు కించపరుచుకుంటూ కిందకు లాగే ప్రయత్నం చేయడంపై దృష్టి పెట్టడం మాని, వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు, ఇతరుల ఎదుగుదలలోనూ సాయం చేయండి. ఇలాంటి అసభ్యపదజాలంతో కూడిన జోక్‌లను తీవ్రంగా ఖండిస్తున్నా. యూట్యూబర్‌లే కాదు, ఎవరు ఇలా మాట్లాడినా హర్షించదగ్గ విషయం కాదు’’ అని కార్తికేయ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. ‘మీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సదరు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా?’, ‘ఒక్క మూవీ కోసం ఎన్ని అసభ్య మాటలు అనిపించుకున్నావు అన్నా..’, ‘ఇంటర్వ్యూల సమయంలో వాళ్ల జోక్‌లను ప్రోత్సహించిందే మీరే కదా’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.

‘‘అవును వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన మాట వాస్తవమే. అదంతా సినిమా ప్రమోషన్‌లో భాగం. సినిమా విడుదలకు ముందు ఇతర ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లే వారికీ ఇచ్చాను. కానీ, వాళ్ల ప్రశ్నలు ఒకింత షాక్‌కు గురిచేశాయి. అయితే, అక్కడ సీన్‌ క్రియేట్‌ చేయాలనుకోలేదు. సాధ్యమైనంత వరకూ తేలిగ్గా తీసుకున్నా. అయితే, ఇలాంటి సమయంలో నా అభిప్రాయాన్ని తెలియచేయడం కోసమే ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాల్సింది కాదు. కానీ, సినిమాలో కీలక పాత్రధారిగా ఆ మూవీని వీలైనన్ని వేదికల ద్వారా ప్రమోట్‌ చేయడం నా బాధ్యత. అంతేకాదు, వాళ్లు మాట్లాడే అసభ్య పదాలను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. దురదృష్టవశాత్తూ అందులో భాగమైనందుకు బాధపడుతున్నా. ఇక నుంచి ఇంటర్వ్యూల విషయంలో జాగ్రత్తగా ఉంటా. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దు’’ అని వివరణ ఇచ్చారు.

*** ఇంత నీచంగా ఆలోచిస్తారా: ఖుష్బూ
‘‘తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధం గురించి ఇంత భయంకరంగా, నీచంగా ఆలోచించడం నిజంగా హేయం. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, సిగ్గుశరం లేకుండా సోషల్‌మీడియా వేదికగా అలాంటివి చూడటం. ఇలాంటి ఘటనలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన మంచు మనోజ్‌ను అభినందిస్తున్నా. ఈ విషయంలో అతడికి మరింత మద్దతు లభించాలి. ఈ వాటిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖమంత్రి అన్నపూర్ణను కోరుతున్నా’’ అని ఖుష్బూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

*** స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు: విశ్వక్‌సేన్‌
‘‘ఇలాంటి సున్నితమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు సాయితేజ్‌గారికి కృతజ్ఞతలు. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఇతరులపై ప్రభావం చూపించటం కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్లతో కలిసి జీవించడం నిజంగా బాధాకరం. ఈ ఘటనపై స్పందించినందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిగారికి ధన్యవాదాలు. భద్రతతో కూడిన సమాజం కోసం శ్రమిద్దాం. అదే సమయంలో మన హోదాకన్నా వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని చాటిచెబుదాం’’ అని సినీ నటుడు విశ్వక్‌సేన్‌ అన్నారు.

*** అందుకు క్షమాపణలు చెబుతున్నా: సుధీర్‌బాబు
‘‘మంచో చెడో నేను సోషల్‌మీడియాలో ఎక్కువగా కనిపించే వ్యక్తిని కాదు. ప్రణీత్‌ హనుమంతును ‘హరోంహర’లో తీసుకున్నందుకు అసహ్యమేస్తోంది. నేను, అందుకు క్షమాపణలు చెబుతున్నాం. అతడు ఇలాంటి నీచమైన జీవి అనుకోలేదు. నాక్కూడా పెద్దగా తెలియదు. వీళ్ల గురించి సోషల్‌మీడియాలో చెప్పడానికి తగినంత ధైర్యం కూడా రావటం లేదు. కానీ, ఈ సమయంలో కచ్చితంగా స్పందించాలి. ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వాళ్ల గురించి తెలియజేయాలి. వాళ్లు మాట్లాడిన మాటలు ఎప్పటికీ భావ ప్రకటనా స్వేచ్చ కిందకు రావు’’ అని సినీ నటుడు సుధీర్‌బాబు పోస్ట్‌ పెట్టారు.

ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai Durgha Tej) కూడా పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయని మండిపడ్డారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు. సోషల్‌ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z