ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని (Ratna Bhandar) తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు. రత్న భాండాగారాన్ని చివరిసారి 1978లో తెరిచారు.
‘‘రత్న భాండాగారం రహస్య గదిని జులై 14న తిరిగి తెరిపించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా శ్రీక్షేత్ర పాలనాధికారికి సూచించాం. వాస్తవానికి.. నేటి సమావేశంలోనే సమర్పించాలని కోరాం. అయితే.. ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదు. డూప్లికేట్ తాళం చెవితో తెరచుకోని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించాం’’ అని జస్టిస్ రథ్ తెలిపారు. తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని, ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని, ఆ తర్వాత ‘రత్న భండార్’ను తెరవొచ్చన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z