రహదారుల గుంతలను తక్కువ ఖర్చుతో మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం థర్మల్ కేంద్రాల్లో లభించే ఫ్లైయాష్ వాడకంపై దృష్టి పెట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించిన మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో ఫ్లైయాష్‌తో రోడ్లకు మరమ్మతు చేసి ఎంతవరకు మన్నుతున్నాయనేది పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నున్న బైపాస్‌లోనూ, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఓ రహదారిలో రెండేసి కి.మీ. మేర గుంతలు పూడ్చారు. ఫ్లైయాష్‌తో నీరు కలిపి గుంతలు పూడ్చటం, ఫ్లైయాష్, కంకర కలిపి గుంతలు పూడ్చటం, ఫ్లైయాష్, కంకర, సిమెంట్‌తో గుంతలు పూడ్చటం వంటి మూడు ప్రయత్నాలు చేశారు. ఇందులో ఫ్లైయాష్, కంకర, సిమెంట్ మిక్సింగ్‌తో పూడ్చిన గుంతలు కొంతవరకు పటిష్ఠంగా ఉన్నట్లు గుర్తించారు. తక్కువ ఖర్చుతో గుంతలు ఎలా పూడ్చవచ్చనే అంశంపై అధ్యయనానికి విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటున్నారు. ఈ విషయంలో సహకరించేందుకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తిరుపతి ఐఐటీలు ముందుకొచ్చాయి. త్వరలో ఇంజినీర్లతో చర్చించి వారు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. రహదారులపై సీఎం చంద్రబాబు త్వరలో సమీక్షించే నాటికి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z