Business

₹75 పెరగనున్న భారతీయుడు-2 టికెట్ ధర-BusinessNews-July 10 2024

₹75 పెరగనున్న భారతీయుడు-2 టికెట్ ధర-BusinessNews-July 10 2024

* దేశీయ ఆటో మొబైల్‌ కంపెనీలు తమ ఎస్‌యూవీల ధరలను తగ్గిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇప్పటికే వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. డిమాండ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700ను తీసుకొచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏ7 శ్రేణి వాహన ధరలను రూ.2.లక్షల వరకు తగ్గించింది. ఈ మోడల్‌ ధరలు ఇకపై రూ.19.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలల పాటు తగ్గించిన ధరలు అందుబాటులో ఉంటాయని మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది. మార్కెట్లో ఈ మోడల్‌ ఇప్పటికే విక్రయాల పరంగా 2 లక్షల మైలురాయిని అందుకుంది. మరో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ సైతం తన ఫ్లాగ్‌షిప్‌ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.70వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు రూ.1.4 లక్షల విలువైన ప్రయోజనాలనూ అందిస్తోంది. టాటా మోటార్స్ తాజా నిర్ణయంతో పాపులర్‌ ఏయూవీలైన హ్యారియర్‌ (రూ.14.99 లక్షలు), సఫారీ (రూ.15.49 లక్షలు) ధరలు దిగొచ్చాయి. వీటితో పాటు నెక్సాన్‌.ఈవీ పైనా రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పంచ్‌.ఈవీ పైనా రూ.30వేల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.

* ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు (Bharateeyudu Ticket Price) వీలు కల్పించింది. సినిమా విడుదలకానున్న రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 19 వరకు ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంపాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది. నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిందే ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రానుంది.

* రిలయన్స్‌ జియో మరో స్మార్ట్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన జియో ట్యాగ్‌కు కొనసాగింపుగా జియో ట్యాగ్‌ ఎయిర్‌ను (JioTag Air) తాజాగా లాంచ్ చేసింది. తాళాలు, లగేజీ, వాలెట్‌, పెంపుడు జంతువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ డివైజ్‌ పనికొస్తుంది. ఇందులో ఫైండ్‌ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. తరచూ ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఈ డివైజ్‌ పనికొస్తుంది. జియోట్యాగ్‌ ఎయిర్‌ ధరను ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,499గా నిర్ణయించారు. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్‌, అమెజాన్‌ ఇండియాలో కొనుగోలు చేయొచ్చు. బ్లూ, గ్రే, రెడ్‌ కలర్స్‌లో లభిస్తుంది. క్రెడ్‌, పేటీఎం, ఎంపిక చేసిన కార్డులతో జియో ట్యాగ్‌ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. జియో ట్యాగ్‌ ఎయిర్‌ రెండు రకాల ట్రాకింగ్‌ యాప్స్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు జియో థింగ్స్‌ యాప్‌తో దీన్ని వినియోగించొచ్చు. యాపిల్‌ యూజర్లు ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ యాప్‌ ద్వారా ఈ డివైజ్‌ను వాడొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 14, ఆపై ఓఎస్‌తో ఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ ట్రాకర్‌ బ్లూటూత్‌ 5.3తో పనిచేస్తుంది. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్‌ కూడా ఉంటుంది. ఇది 90-120 db రేంజ్‌తో శబ్దం చేయగలదు. ఈ బుల్లి డివైజ్‌ బరువు కేవలం 10 గ్రాములే. ఇందులోని బ్యాటరీ 12 నెలల పాటు పనిచేస్తుంది. అదనపు బ్యాటరీ, ల్యాన్‌యార్డ్‌ రిటైల్‌ బాక్సులో అదనంగా అందిస్తున్నారు.

* తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు బుధవారం (జూలై 10) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూవచ్చిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 73,200 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,100 వద్ద కొనసాగుతన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,350 వద్ద ఉన్నాయి. చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో స్పల్పంగా తగ్గింపు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,600 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.

* మోసపూరిత లావాదేవీలు, ఎవర్‌గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది అకౌంట్లను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బిజినెస్‌ స్టాండర్ట్‌ కథనం ప్రకారం.. “గత రెండు సంవత్సరాల్లో మరింత దృష్టి కేంద్రీకరించిన అంశం.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణ. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉన్నాయని మేము గుర్తించాం” అని మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్.జె పేర్కొన్నారు.ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు , రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని, వీలైనంత తగ్గించాలని సీఎఫ్‌లకు స్వామినాథన్‌ సూచించారు. గత వారం బ్యాంక్ చీఫ్‌లతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. మ్యూల్ ఖాతాలను (చట్టవిరుద్ధమైన ఖాతాలు), డిజిటల్ మోసాలను అరికట్టాలని కోరారు.

* ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే రిటైర్‌మెంట్‌కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్‌టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్‌లో చేయాల్సి ఉంటుంది.“అంతర్గత ఫిట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది” ఒక అధికారి తెలిపారు.అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. “నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్‌లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది” అని మూడో అధికారి చెప్పారు.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దాంతో వరుస సెషన్లలో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ఇటీవల వరుస సెషన్లలో మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ వచ్చిన మార్కెట్లకు నష్టాలతో బ్రేక్‌ పడినట్లయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో పాటు సూచీలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 80,481.36 వద్ద లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ మరోసారి 80,481.36 పాయింట్ల మార్క్‌ను చేరుకొని మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరింది.ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్‌ పతనం ప్రారంభమైంది. ఒక దశలో 900 పాయింట్ల వరకు తగ్గింది. ఇంట్రాడేలో 80,481.36 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. ఒక దశలో 79,435.76 పాయింట్లకు తగ్గింది. చివరకు స్వల్పంగా కోలుకొని.. 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం కిత్రం సెషన్‌తో పోలిస్తే 24,459.85 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ 24,461.05 పాయింట్ల ఆల్‌టైమ్‌ హైని చేరుకున్నది. అనంతరం కొద్దిసేపటికే నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నది. ఒక దశలో 300 పాయింట్ల వరకు తగ్గింది. చివరిగా స్వల్పంగా కోలుకుంది. ఇంట్రాడేలో 24,461.05 పాయింట్లకు పెరిగిన నిఫ్టీ.. 24,141.80 అత్యల్పానికి చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z