సైబర్ నేరాలకు సంబంధించి దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్‌లో బయటపడటం సంచలనం రేపింది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం… అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసంలో భాగంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ జరగడంతో గుర్తించిన పోలీసులు సంబంధిత ముఠాను ముంబయిలో ఇటీవల పట్టుకున్నారు. వారు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే అందులో కీలక వ్యక్తులు కరీంనగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి నుంచి ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు గురువారం కరీంనగర్‌కు వచ్చారు. మొదట సీపీని కలిసి, అనుమతి తీసుకున్న తర్వాత స్థానిక మూడో ఠాణా పరిధిలోని వివిధ కాలనీల్లో కొందరి గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో వారిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకుని, స్థానిక ఠాణాకు తీసుకెళ్లారు. వారిని గురువారం (సాయంత్రం నుంచి రాత్రి వరకు విచారణ చేసి, పలు వివరాలను సేకరించారు. వారి బ్యాంకు ఖాతాలను సైతం నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇద్దరిని వదిలేసి, ఒకరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. శుక్రవారం కూడా ముంబయి పోలీసులు స్థానికంగా దర్యాప్తు చేస్తారని, బ్యాంకు అధికారులను సైతం కలవనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే కేసులో కీలకంగా భావిస్తున్న ఓ మహిళ కోసం వారు ఆరా తీస్తున్నారు. కరీంనగర్‌లో సైబర్ నేరగాళ్ల ముఠా మూలాలు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z