Business

టీసీఎస్ లాభం ₹12వేల కోట్లు-BusinessNews-July 11 2024

టీసీఎస్ లాభం ₹12వేల కోట్లు-BusinessNews-July 11 2024

* తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు చెప్పారు. యూడీఐఏలో ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యగా చెబుతున్న అధికారులు దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డారు. సమస్య పరిష్కారమైతే వేచి ఉన్న వారి రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేస్తామని, రద్దీగా ఉన్న కార్యాలయాల్లో శుక్రవారం రావాల్సిందిగా ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొన్నారు.

* ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై చెల్లించే వడ్డీకి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అప్‌డేట్‌ ఇచ్చింది. ఫైనల్‌ పీఎఫ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తున్న ఉద్యోగులకు సవరించిన వడ్డీ రేట్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి యూజర్ల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ నిల్వలపై 8.25 శాతం వడ్డీ ఖరారు చేస్తూ మే 31న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు ఈపీఎఫ్‌ఓ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 2023-24 మధ్యలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారిందరికీ సవరించిన వడ్డీనే చెల్లించినట్లు ఈపీఎఫ్‌ తెలిపింది. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత సవరించిన వడ్డీ ప్రయోజనం అందాలన్న ఉద్దేశంతో ఫైనల్‌ సెటిల్‌మెంట్లు చేసుకుంటున్న మెంబర్లందరికీ అదే వడ్డీని చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఖాతాదారులకు అదే వడ్డీ త్వరలో అందుతుందని, ఎప్పుడనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. గరిష్ఠాల వద్ద మరోసారి మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌.. ఆఖర్లో మళ్లీ కోలుకుంది. చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా.. ఐటీసీ, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ షేర్లు అండగా నిలిచాయి. సెన్సెక్స్‌ ఉదయం 80,170 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,924.77) లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,464.38 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో మళ్లీ కోలుకుని 27 పాయింట్ల నష్టంతో 79,897.34 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8.50 పాయింట్ల నష్టంతో 24,316 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.56 గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టైటాన్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.50 డాలర్లు, బంగారం ఔన్సు 2388 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

* ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG)తో నడిచే బైక్‌ను ఆవిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షించింది బజాజ్‌ ఆటో. ఫ్రీడమ్‌ 125 మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసి కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ (TVS) మోటార్స్‌ సైతం సీఎన్‌జీపై దృష్టి సారించింది. సీఎన్‌జీ ఆప్షన్‌తో ఓ స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేశంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉన్న టీవీఎస్‌కు 18 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ కంపెనీ కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయ ఇంధనంపై పని చేస్తోంది. ఇందులోభాగంగా సీఎన్‌జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందులోభాగంగా స్కూటర్‌ రూపంలో సీఎన్‌జీ ద్విచక్ర వాహనం తీసుకురావాలన్నది టీవీఎస్‌ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తొలి సీఎన్‌జీ స్కూటీ అదే అవుతుంది. పాపులర్‌ స్కూటర్‌ అయిన జూపిటర్‌ 125ను సీఎన్‌జీ వేరియంట్‌లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి ఓ రూపు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

* జులై 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టబోతోంది. వివిధ వర్గాలు తమ ఆశలు, ఆకాంక్షలను ఇప్పటికే కేంద్రానికి వివిధ మార్గాల్లో తెలియజేశాయి. పన్ను చెల్లింపుదారుల దగ్గరి నుంచి స్టాక్‌ మార్కెట్‌ మదుపర్ల వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోని అంశాలపై ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు బ్రేకరేజీ సంస్థలు సైతం తమ అంచనాలను వెల్లడించాయి. ప్రజల వినిమయ శక్తిని పెంచేలా కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) పన్ను కోతలు ఉండొచ్చని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల (PLI) పథకం విస్తరణ, రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, అదనపు హెల్త్‌కేర్‌ కవర్‌ వంటి ప్రకటనలు ఉండొచ్చని ఆశిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 11 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. సున్నా ట్యాక్స్‌ శ్లాబు (Tax Slabs) పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచొచ్చని బీఓఎఫ్‌ఏ అంచనా వేసింది. అలాగే రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై పన్ను (Income Tax) భారం తగ్గించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. సెక్షన్‌ 80సీ మినహాయింపుల్లోనూ మార్పులు చేయొచ్చని తెలిపింది. మరిన్ని మెట్రోయేతర నగరాలకూ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అత్యంత రిస్క్‌తో కూడుకొన్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యాన్ని తగ్గించే దిశగానూ చర్యలు ఉండొచ్చని అంచనా వేసింది.

* ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు గడువు దగ్గర పడుతోంది. జులై 31తో ఈ గడువు ముగుస్తోంది. ఫైలింగ్‌కు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి ఆదాయపు పన్ను శాఖకు (Income tax department) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫైలింగ్‌ కోసం ఉద్దేశించిన ఇ-ఫైలింగ్‌ (e-filing) పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

* ఫాస్టాగ్, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్‌ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్‌ సొల్యూషన్ల సంస్థ బిల్‌డెస్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వెల్లడించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ పోస్ట్‌పెయిడ్‌ బిల్లుల విభాగాలకు ఈ సదుపాయాన్ని విస్తరించినట్లు తెలిపింది.

* అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 55 పాయింట్ల లాభంతో 79,980 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో టీసీఎస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ ఫార్మా, ఎం అండ్‌ ఎం, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* దేశంలో మళ్లీ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో 8.7 శాతం వృద్ధితో రూ.12,040 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.11,074 కోట్లుగా ఉంది. మార్చితో త్రైమాసికంతో పోలిస్తే 3.1 శాతం క్షీణించడం గమనార్హం. మొత్తం ఆదాయం 5.4 శాతం వృద్ధితో 62,613 కోట్లుగా ఉంది. కంపెనీ బోర్డు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్‌ బోర్డు ఖరారు చేసింది. ఆగస్టు 5న చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది. జులై 20ని రికార్డు తేదీగా ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 5,452 మందిని నియమించుకున్నట్టు టీసీఎస్‌ తెలిపింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరినట్లు పేర్కొంది మొత్తం ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని, 151 దేశాలకు చెందిన వారు ఉన్నారని టీసీఎస్‌ తెలిపింది. వలసల రేటు 12.1%గా ఉన్నట్లు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z