Editorials

జూన్ 25 రాజ్యాంగం హత్య చేయబడిన రోజు-NewsRoundup-July 12 2024

జూన్ 25 రాజ్యాంగం హత్య చేయబడిన రోజు-NewsRoundup-July 12 2024

* తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కురియన్‌ కమిటీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్‌ కమిటీ సభ్యులు.. అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కమిటీ భేటీకి నాయకులంతా హాజరై వారి అభిప్రాయాలు తెలియజేశారు. మొదటి రోజు 16 లోక్‌సభ అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న కమిటీ.. శుక్రవారం అనేక మంది నాయకుల అభిప్రాయాలను సేకరించింది.

* రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చిన ఆయన సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* కేరళ యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి రానున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కేరళ నుంచి ఏపీకి మూడేళ్లపాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలో సమర్థుడైన ఐఏఎస్‌ అధికారిగా కృష్ణతేజ పేరు తెచ్చుకున్నారు. పనితీరుతో 2 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారని సమాచారం. ఇటీవల ఆయన.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే. సుపరిపాలన కోసం సమర్థులైన ఐఏఎస్‌లను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.

* బ్రిటన్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అతి త్వరలో ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దానికి గడువు విధించడం ద్వారా తమ తలపై తుపాకీ గురి పెట్టొద్దని యూకేలోని కొత్త ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన ఆ దేశానికి చెందిన మీడియా సంస్థతో మాట్లాడారు. ఏ ఒప్పందానికైనా డెడ్‌లైన్‌ ఉండాలనేదాన్ని భారత్ విశ్వసించదన్నారు. తలకు తుపాకీ గురిపెట్టినట్లు.. ఏ దేశంతోనూ తాము ఇంతవరకూ బలవంతంగా, ఒత్తిడి తెచ్చి ఎఫ్‌టీఏ చర్చలు జరపలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచించారు.

* ప్రపంచ ప్రఖ్యాత హ్యారీ పోటర్‌(Harry Potter) రచయిత్రి జేకే రౌలింగ్‌ (JK Rowling)ను ఎందరో పుస్తక ప్రియులు అభిమానిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆమె రచన హ్యారీ పోటర్‌ పుస్తకాలూ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంతటి గొప్ప వ్యక్తి తన అభిమాని అయిన ఓ భారత యువకుడి గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నాడా యువకుడు. అసలు ఏం జరిగిందంటే..? 2007లో రీస్ థామస్(14) కేరళలోని మన్నూరులోని గార్డియన్ ఏంజెల్ స్కూల్‌లో 9వ తరగతి చదివేవాడు. హ్యారీ పోటర్‌ సిరీస్‌లోని ఆరు పుస్తకాలను చదివాడు. ఆ సమయంలో విడుదలైన ‘ది డెత్లీ హాలోస్’ (ఏడో పుస్తకం) ఎలాగైనా చదవాలని తహలహలాడాడు. కానీ ఆ పుస్తకం కొనేందుకు డబ్బుల్లేవు. తప్పని తెలిసినా ఇక చేసేదేమీ లేక అక్కడ ఉన్న న్యూ కాలేజ్ బుక్ స్టాల్‌కు వెళ్లి ఆ పుస్తకం దొంగలించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ తాను చేసింది తప్పని అనిపిస్తుండడంతో దాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఇటీవల అతడు ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయడానికి ఆ బుక్‌స్టాల్‌కు వెళ్లాడు. అక్కడి బుక్‌ స్టాల్‌ యజమాని దేవదాస్‌కు జరిగిన విషయమంతా చెప్పి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేశాడు. దీన్ని ‘నా బహుమతిగా నువ్వే దాచుకో’ అని ఆ యజమాని తిరిగి ఇచ్చేశాడు.

* మనం బస్సులో వెళుతూ ఉంటాం.. వాట్సప్‌ గ్రూప్‌లో వరుసగా వాయిస్‌ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి.. వినడానికేమో సమయానికి ఇయర్‌ ఫోన్సు అందుబాటులో ఉండవు. అలాంటి సందర్భాల్లో బస్సు దిగాక గానీ వాటిని వినడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాయిస్‌ సందేశాల్లో ఏముందో చెప్పే ఫీచర్‌ను వాట్సప్‌ (Whatsapp) తీసుకొస్తోంది. ఇదో ట్రాన్స్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌. అంటే.. వాయిస్‌ మెసేజ్‌లను టెక్స్ట్‌ రూపంలో చూపిస్తుందన్నమాట. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్‌ తారసపడింది. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. వాయిస్‌ మెసేజ్‌ వచ్చినప్పుడు లేదా పంపినప్పుడు దాని కింద ట్రాన్స్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే అందులోని సందేశం యథావిధిగా టెక్స్ట్‌ రూపంలో కనిపిస్తుంది. అలాగని, ఇది ట్రాన్స్‌లేటర్‌ కాదు. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ భాషకు అక్షర రూపాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీ, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషలకు సపోర్ట్‌ చేస్తోంది. ఇతర భాషలకూ తీసుకొస్తుందో లేదో చూడాలి. గతంలో ఐఓఎస్‌ బీటా యూజర్లకు ఇదే తరహా ఫీచర్‌ దర్శనమిచ్చింది. సాధారణ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* తన సినీ కెరీర్‌లో ఎదురైన ఫ్లాప్‌లను చూసి కొందరు సంతోషపడుతున్నారని, ఇండస్ట్రీలో ఇలాంటి రాజకీయాలు చూస్తే బాధగా ఉందని స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) అన్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన దాదాపు 10 చిత్రాల్లో కేవలం రెండు మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కీలక పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘సర్ఫిరా’. తమిళంలో సూర్య నటించిన ‘సూరారైపోట్రు’ (ఆకాశం నీహద్దురా) రీమేక్‌గా ఇది రూపొందింది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అక్షయ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలతో పాటు, కెరీర్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించారు.

* సైబర్‌ నేరగాళ్లు మరో కొత్తతరహా మోసానికి (Scam alert) తెర తీశారు. ఇండియా పోస్ట్‌ (India post) పేరుతో లింకులు పంపిస్తూ డబ్బు దోచేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్సెమ్మెస్‌ ద్వారా వస్తున్న ఈ మోసపూరిత లింకులపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం అప్రమత్తం చేసింది. ఈతరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తాజాగా ట్వీట్‌ చేసింది. ‘పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి మీకో పార్శిల్‌ వచ్చింది. డెలివరీ చేద్దామని రెండుసార్లు ప్రయత్నించినా చిరునామా సరిగా లేనందువల్ల సాధ్యం కాలేదు. 48 గంటల్లో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోండి. లేదంటే ప్యాకేజీ రిటర్న్‌ వెళ్లిపోతుంది’’ అంటూ కొందరికి సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. చిరునామా అప్‌డేట్ కోసం ఓ లింక్‌ను కూడా అందులో ఇస్తున్నారు. అప్‌డేట్‌ చేసుకుంటే 24 గంటల్లోనే పార్శిల్‌ డెలివరీ చేస్తామన్నది ఆ సందేశంలోని సారాంశం.

* ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్‌ ఆపారు. నక్సల్స్‌ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

* తమ భూమిని మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) అక్రమంగా లాక్కుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) అన్నారు. తన భార్య పరిహారం పొందేందుకు అర్హురాలని వ్యాఖ్యానించారు. విపక్ష నాయకులవి అర్థం లేని ఆరోపణలు అని తోసిపుచ్చారు. ఈసందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని ల్యాండ్‌తో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్‌ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే భాజపా విమర్శలకు కారణమైంది. ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది.

* అస్థిర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ ఓటమిపాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్‌ పార్లమెంటులో.. ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది. నేపాల్‌ ప్రధానిగా డిసెంబర్‌ 25, 2022లో పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (CPN-UML)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు.

* మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్‌ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తే.. మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైఎస్‌ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్‌ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై కేసు నమోదు చేయించడం ద్వారా.. టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.

* మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఒక ప్లాన్‌ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై‌ టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్‌ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు.తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు?… డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్‌ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు.

* కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది జూన్‌ 25వ తేదీని సంవిధాన్‌ హత్యా దివస్‌(రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన ఎక్స్‌ ద్వారా ప్రకటన చేశారు.1975లో ఆ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజులకు నిరసనగా ఇక నుంచి సంవిధాన్‌ హత్యా దివస్‌ నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని అమిత్‌ షా తెలిపారు. ఎమర్జెన్సీలో కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా సంవిధాన్ హత్య దివస్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.‘‘1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్‌ 25ను ‘సంవిధాన్‌ హత్య దివస్‌’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారాయన.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు. తమను అరెస్ట్‌ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్‌ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్‌ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z