ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఫిర్యాదు అందిన అయిదు గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు బాధితుడిని గుర్తించడంతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. జూబ్లీహిల్స్‌లోని హుడా ఎన్‌క్లేవ్ నందగిరిహిల్స్‌లో నివసించే వాకటి రవిచంద్రారెడ్డి రాయదుర్గం టీ-హబ్ సమీపంలోని ఆర్బిట్‌మాల్‌లో ‘గిగ్లైజ్’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభించాడు. కన్సల్టెన్సీల ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణనిచ్చి దశలవారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. కొద్ది నెలలపాటు జీతాలు చెల్లించినా జనవరి నుంచి చెల్లించడం లేదు. ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. అనంతరం రవిచంద్రారెడ్డి, అతని స్నేహితుడైన మోహన్‌ను బలవంతంగా కార్లలో తీసుకెళ్లారు.
నగరంలో పలు ప్రాంతాలు తిప్పి చివరికి నాగర్‌కర్నూల్ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. అంతకుముందే మూత్రవిసర్జన పేరుతో మోహన్ కారులోంచి దిగి పారిపోయాడు. కుమారుడు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన రవిచంద్రారెడ్డి తల్లి వాకటి మాధవి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేపటి రాత్రి 10గంటల ప్రాంతంలో నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకొని గురువారం అర్ధరాత్రికి ఠాణాకు తరలించారు. వీరితోపాటు తీసుకెళ్లిన 82 ల్యాప్‌టాప్‌లను, కొన్ని చరవాణులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కిడ్నాప్ చేసినవారిలో జగదీశ్, గౌతం, సుజిత్, శివ, ఆజాద్, మల్లేష్, ప్రవీణ్, కమల్‌లు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేశారు.
సంస్థ ఉద్యోగులు శుక్రవారం ఠాణా వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో దాదాపు రూ. 15కోట్లు వసూలు చేశారన్నారు. రవిచంద్రారెడ్డి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ తరుఫున బరిలో నిలిచి మధ్యలోనే వెనక్కితీసుకొన్నారు. అతని సోదరి చాందినిరెడ్డి ఇదే పార్టీ నుంచి నంద్యాలలో బరిలో నిలిచారని తెలిపారు. తమ డబ్బులతో ఎన్నికల బరిలో నిలిచారని ఆరోపించారు. రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయాలని వారికి జూబ్లీహిల్స్ పోలీసులు సూచించారు. నియామకాలు చేసుకున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడటానికి తీసుకెళ్లామని అరెస్ట్ అయిన కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z