Business

ఒక డాలరుకు ₹83.51 రూపాయిలు-BusinessNews-July 12 2024

ఒక డాలరుకు ₹83.51 రూపాయిలు-BusinessNews-July 12 2024

* ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCL Tech) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి (Q1 Results) 20.3 శాతం వృద్ధితో రూ.4,257 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,534 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆదాయంలో 7శాతం వృద్ధితో రూ.28,057 కోట్లుగా నమోదైనట్లు హెచ్‌సీఎల్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

* నష్టాల్లో ప్రభుత్వరంగ సంస్థలను నడపడం.. వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదు అంటూ ప్రైవేటీకరణ విషయంలో కుండబద్ధలు కొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గత పదేళ్లలో ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగానే ముందుకెళ్లిన సర్కారు.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకు మరమ్మతు చేయాలన్న యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ రంగానికి చెందిన 200 సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలనేది మోదీ 3.0 ఆలోచనగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిని లాభాల్లోకి తీసుకురావడం ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని పేర్కొన్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ఆస్తులను, ఇతర ఆస్తులను నగదీకరించి ఆ మొత్తాన్ని ఆయా కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి.. ఆపై కంపెనీలకు దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పనితీరు, ఉత్పత్తి మెరుగు కోసం ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించనున్నట్లు పేర్కొన్నాయి. నగదీకరణకు సంబంధించి బడ్జెట్‌లో (Union budget) ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పాటు సుమారు 2.30 లక్షలకు పైగా మేనేజర్లకు శిక్షణ ఇప్పించి వారిని సీనియర్‌ రోల్స్‌లోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఐటీ స్టాక్స్‌ అండతో శుక్రవారం దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్‌ 80,893.5 పాయింట్లు, నిఫ్టీ 24,592 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. తర్వాత కాస్త వెనక్కి తగ్గినా రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా అంచనాలను మించి టీసీఎస్‌ లాభాలను ప్రకటించడం ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. మరోవైపు జూన్‌లో అమెరికాలో సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. సెన్సెక్స్‌ ఉదయం 80,093.62 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,897.34) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79,843.39 -80,893.51 మధ్య చలించింది. చివరికి 622 పాయింట్ల లాభంతో 80,519.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 186.20 పాయింట్ల లాభంతో 24,502 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.10 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2407 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

* సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్‌ వడ్డీ సొమ్మును అవుట్‌గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్‌ పీఎఫ్‌ సెటిల్‌మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు. ఈపీఎఫ్‌ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్‌ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్‌ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్‌గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.

* వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి టీసీఎస్‌ వేసిన మంత్రం ఫలించింది. వేరియబుల్ పేను కార్యాలయ హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని అమలు చేశాక దాదాపు 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.అయితే ఇది తాత్కాలిక చర్య అని, దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ చెల్లింపును వారి కార్యాలయ హాజరుతో లింక్ చేసింది. దీని ప్రకారం 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు త్రైమాసిక బోనస్‌కు అర్హులు కాదు.వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించిన నెలల తర్వాత ఈ పాలసీ అప్‌డేట్ వచ్చింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి. 75-85 శాతం హాజరున్న ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో 75 శాతం, 60-75 శాతం హాజరు ఉన్నవారు 50 శాతం మాత్రమే వేరియబుల్ పే పొందుతారు.

* పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్‌ బుకింగ్స్‌ భారీగా పెరినట్లు ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది. తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్‌ జరిగే ప్రదేశాల చుట్టూ ఉ‍న్న హోటల్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్‌ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్‌ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్‌ను బుక్‌ చేసుకున్నారు. ఈమేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్‌లైన్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌పామ్‌ ఎయిర్‌ బీఎన్‌బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్‌ జరిగే ఆక్వాటిక్స్‌ సెంటర్‌, బెర్సీ అరెనా, బార్‌డాక్స్‌ స్టేడియం, చాంప్‌ డే మార్స్‌ అరెనా, చాటూ డి వెర్సల్లీస్‌, చాట్రాక్స్‌ షూటింగ్‌ సెంటర్‌, ఈఫిల్‌ టవర్‌ స్టేడియం..వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్‌ పూర్తిగా బుక్‌ అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్‌ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్‌ను సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్‌, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. భారతీయ ప్రయాణికులు పారిస్‌తోపాటు సమీపంలోని నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది.ఈ సందర్భంగా ఎయిర్‌ బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్‌కు హాజరుకానున్నారు. భారతీయులు ఒలింపిక్స్ ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో కంటే 30 శాతం భారత ప్రయాణికుల సంఖ్య​ పెరుగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి హోటల్స్‌లో బుక్ అయిన ‘స్టేయింగ్‌ టైం(రాత్రి, పగలు బుక్‌ చేసుకునే సమయం)’ రెండేళ్ల క్రితం వ్యవధితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది’ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z