Fashion

జపాన్‌లో ప్రతిరోజు అందరూ నవ్వాలని కొత్త చట్టం

జపాన్‌లో ప్రతిరోజు అందరూ నవ్వాలని కొత్త చట్టం

ఏ దేశంలోనైనా పాలనాపరమైన చట్టాలు చేస్తారు. నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికో, ప్రజల సంక్షేమానికో ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తాయి. జపాన్‌లో మాత్రం ప్రతిరోజూ అందరూ నవ్వాలని చట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యమగట ప్రిఫెక్చర్‌ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈమేరకు శుక్రవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది.

యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం. మెరుగైన ఆరోగ్యం, జీవనకాల పెంపుపై అక్కడి పరిశోధకులు అధ్యయనం చేశారు. తక్కువగా నవ్వే వాళ్లలో కొన్నిరకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త చట్టాన్ని కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నవ్వలేకపోవచ్చునని.. ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. పైగా నవ్వడం, నవ్వకపోవడమనేది భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ తెలిపింది. ఇలాంటి నిబంధనల ద్వారా ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. ఈ విమర్శలను అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కొట్టిపారేసింది. తామేమీ బలవంతంగా ప్రజలపై రుద్దడం లేదని.. వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. అందుకే జరిమానా వంటి అంశాలను చేర్చలేదని వివరించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z