NRI-NRT

ఆస్ట్రేలియా-లండన్‌లలో బోనాల వేడుకలు

ఆస్ట్రేలియా-లండన్‌లలో బోనాల వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ పాల్గొన్నారు. స్వదేశంలో జరుపుకుంటున్నట్లుగానే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బోనాల పండుగను నిర్వహించారు. ఈ బోనాల పండుగలో ముఖ్యంగా తొట్టెల ఊరేగింపు, పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నత చదువుల కోసం లండన్‌కు వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్‌ మల్చేలం.. తన వంశవృత్తిని మరిచిపోకుండా పోతురాజు వేషధారణతో.. బోనాల ఊరేగింపులో పాల్గొని సరికొత్త శోభ తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా అతని ప్రవాసులతో పాటు బోనాల ఉత్సవాలకు హాజరైన విదేశీ ముఖ్య అతిథులు సైతం ప్రశంసించారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో రాక్‌బ్యాంక్‌ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్‌బోర్న్‌ బోనాలు సంస్థ ఈసారి కూడా బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. పోతురాజుల ఆటలు, యువకుల పాటలు నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండవగా సాగింది. బోనాల పాటలకు తెలంగాణ యువకులతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా డ్యాన్సులు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్‌ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్‌ గద్దె, ప్రజీత్‌ రెడ్డి కోతిలను వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z