మెదడు తినే అమీబా(బ్రెయిన్ ఈటింగ్ అమీబా)తో కేరళలో ఇటీవలి కాలంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చెరువులు, కుంటలు, శుభ్రం లేని స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈతకొట్టడం లాంటివి చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చోట మెదడు తినే అమీబా(అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్) పెరుగుతుంది. ఈత కొట్టడం లేదంటే స్నానానికి దిగి మునిగినప్పుడు అమీబా ముక్కు ద్వారా మెదడులోకి చేరి అక్కడే తిష్ఠవేస్తుంది. మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపునకు కారణమవుతుంది. ఈ అమీబా సోకిన వారిలో 97 శాతం మందికి పైగా మరణిస్తారని, ఎక్కువ శాతం పిల్లలపైనే ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అమీబా బారిన పడిన తర్వాత బాధితుల్లో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (మెదడు వాపు) వ్యాధి మాదిరే లక్షణాలు కన్పిస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఫిట్స్, వాంతులు లక్షణాలు ఉంటాయి. శరీరంలో అమీబా వృద్ధి చెందిన తర్వాత మెడ బిగుసుకుపోవడం, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, మనోభ్రాంతి లాంటి సమస్యలు తలెత్తుతాయి. కోమాలోకి వెళ్లి చనిపోయే ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z