Devotional

తిరుమలలో భారీ రద్దీ-NewsRoundup-July 13 2024

తిరుమలలో భారీ రద్దీ-NewsRoundup-July 13 2024

* సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార, విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీల ఉప ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypoll Results) ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. భాజపా రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి (INDIA Alliance) అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. శనివారం కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించారు.

* హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంపై జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది మృతి చెందారు. మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్‌ మిలిటరీ వింగ్‌ కమాండర్‌ మహమ్మద్‌ డెయిఫ్‌ (Mohammed Deif), మరో కీలక కమాండర్‌ రఫా సలామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ (Israel) తెలిపింది. అయితే.. వారి ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రం వెల్లడించలేదు.

* వరల్డ్ స్కై డైవింగ్‌ రోజున కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ (Gajendra singh Shekhawat) అరుదైన సాహసం చేశారు. 56 ఏళ్ల వయసులో ఆయన స్కై డైవింగ్ (Sky diving) చేశారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌లో ఈ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత’’ అని మీడియాతో మాట్లాడారు. అలాగే తాను స్కై డైవింగ్ చేసిన చిత్రాలను ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్‌ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు.

* నటులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్‌ చేస్తున్న ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్‌వేదికగా పోస్ట్‌ చేసింది. జస్ట్‌ వాచ్‌ బీబీసీ, ట్రోల్స్‌ రాజా, బచినా లలిత్‌, హైదరాబాద్‌ కుర్రాడు, ఎక్స్‌వైజెడ్‌ఎడిట్‌007 యూట్యూబ్‌ ఛానళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి (Vishnu Manchu) చేశారు. ట్రోలింగ్‌ వీడియోలను డిలీట్‌ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ట్రోలింగ్ వీడియోలు చేసే వారికి, అసభ్యకరమైన వీడియోలు చేసే వారికి ఒక 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నా. దయచేసి అలాంటి వీడియోలన్నీ తక్షణమే తొలగించండి. ఒకవేళ మీరు తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం.అలాగే మీ యూట్యూబ్‌ ఛానళ్లు బ్యాన్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా’’ అని మంచు విష్ణు వీడియోలో విజ్ఞప్తి చేశారు.

* సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చిన వేళ ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల (Anant-Radhika Wedding) వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే, అన్నింటికన్నా స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) డ్యాన్స్‌ వేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. సినిమాల్లో తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అదరగొట్టే రజనీకాంత్‌ బయట మాత్రం చాలా సాధారణంగా ఉంటారు. వివిధ కార్యక్రమాలకు, వేడుకలకు హాజరైనా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. అయితే, అనంత్‌-రాధికా మర్చంట్‌ వివాహ వేడుకలో ఇంకో అడుగు ముందుకువేసి, ఏకంగా బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. రజనీకాంత్‌ ఇలా డ్యాన్స్‌ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘తలైవా అదరగొట్టారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయనతో పాటు, బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ కూడా డ్యాన్స్‌ చేశారు.

* టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, హెడ్ కోచ్‌ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) (71) తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. గత ఏడాదిగా లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. అతడి పరిస్థితిపై తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) ఆవేదన వ్యక్తంచేశాడు. గైక్వాడ్‌ చికిత్స కోసం బీసీసీఐ ఆర్థికసాయం చేయాలని కోరారు. అవసరమైతే తమ పెన్షన్‌ ఇస్తామని అన్నారు.

* భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో హస్తం పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు.

* నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడో యువకుడు. ఇంకా రెండు సార్లు సైతం పాము తనను కాటు వేస్తుందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌరా గ్రామానికి చెందిన వికాస్‌ దూబే అనే యువకుణ్ని 40 రోజుల వ్యవధిలోనే వేర్వేరు పాములు ఏడుసార్లు కాటు వేశాయి. ప్రస్తుతం వికాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల వికాస్‌ ఆశ్చర్యపోయే విషయం బయటపెట్టాడు. తనకు వచ్చిన ఓ కల గురించి కుటుంబసభ్యులకు చెప్పాడు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వచ్చినట్లు వికాస్‌ వివరించాడు. వికాస్‌నే పాములు ఎందుకు కాటు వేస్తున్నాయో అర్థం కావడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా – కేవీ మహేశ్వర్‌రెడ్డి
విజయనగరం- వకుల్‌ జిందాల్‌
అనకాపల్లి- ఎం.దీపిక
సత్యసాయి జిల్లా- వి.రత్న
పార్వతీపురం మన్యం – ఎస్వీ మాధవరెడ్డి
కాకినాడ- విక్రాంత్‌ పాటిల్‌
గుంటూరు- ఎస్‌.సతీశ్‌ కుమార్‌
అల్లూరి జిల్లా – అమిత్‌ బర్దార్‌
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 1- అజితా వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 2గా – తుహిన్‌ సిన్హా
తూర్పుగోదావరి- డి.నరసింహ కిషోర్‌
అన్నమయ్య జిల్లా- వి.విద్యాసాగర్‌ నాయుడు
కోనసీమ జిల్లా – బి.కృష్ణారావు
కృష్ణా ఎస్పీ- ఆర్‌.గంగాధర్‌రావు
పశ్చిమగోదావరి జిల్లా – అద్నాన్‌ నయీమ్‌ ఆస్మీ
ఏలూరు జిల్లా- కె.ప్రతాప్‌ శివకిశోర్‌
పల్నాడు జిల్లా – కె.శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌- మల్లికాగార్గ్‌
ప్రకాశం- ఏ.ఆర్‌.దామోదర్‌
కర్నూలు- జి.బిందు మాధవ్‌
నెల్లూరు జిల్లా- జి.కృష్ణకాంత్‌
నంద్యాల- అధిరాజ్‌సింగ్‌ రానా
కడప – వి.హర్షవర్ధన్‌ రాజు
అనంతపురం – కేవీ మురళీ కృష్ణ

* శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ శనివారం పెరిగింది. భారీగా భక్తులు తరలి రావడం, ఉచిత సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగు రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల వరకు క్యూలైన్లు బారులుదీరాయి. వీరికి శ్రీవారి దర్శనం కోసం 30 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను సిబ్బంది అందిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తితిదే భద్రతాధికారులు, అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

* ఇటలీలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో మగ్గుతున్న 33 మంది భారత కార్మికులను వెట్టి చాకిరీ నుంచి ఇటలీ పోలీసులు విముక్తి కల్పించారు. వెరోనా ప్రావిన్సులో వారి చేత చాకిరీ చేయించుకుంటున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 5,45,300 మిలియన్‌ యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఓ భారతీయ కార్మికుడు మెషినరీలో చేయి కోల్పోయిన ఘటన అనంతరం కార్మికుల దుర్భర పరిస్థితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజా కేసులో కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నదీ భారతీయులేనని తేలింది. తోటి భారతీయులను సీజనల్‌ వర్క్‌ పర్మిట్‌ మీద మెరుగైన జీవనం ఆశ చూపి ఒక్కొక్కరూ 17 వేల యూరోలు చెల్లించేలా ఒప్పందంతో ఇక్కడికి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. వాస్తవానికి వారి చేత వారమంతా రోజుకు 10-12 గంటలు చొప్పున పనిచేయించుకుంటూ గంటకు కేవలం నాలుగు యూరోలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. అప్పు తీరే వరకు తమ వద్దే చాకిరీ చేయించుకుంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు.

* వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ (Puja Khedkar) తండ్రి దిలీప్ ఖేద్కర్ మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘నా కుమార్తె ఏ తప్పు చేయలేదు.. ఓ అధికారి కూర్చోవడానికి స్థలం కావాలని అడగడం తప్పా? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణకు ఓ కమిటీని వేసింది. తుది తీర్పు కోసం అందరం ఎదురుచూద్దాం.. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు’’ అని ఆరోపించారు.

* హీరో, విలన్‌, సహాయ నటుడు.. పాత్ర ఏదైనా సరే తనదైన నటనతో బాలీవుడ్‌లో పేరు సొంతం చేసుకున్నారు నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi). తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్‌ పరంగా వచ్చిన విమర్శలపై స్పందించారు. ఐశ్వర్య రాయ్‌తో ఉన్న వివాదం గురించి మాట్లాడుతూ ఆమె అంటే తనకెంతో ఇష్టమన్నారు. ‘‘2014లో ప్రసారమైన కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐశ్వర్యను ప్లాస్టిక్‌ అని కామెంట్‌ చేశా. అవి కేవలం సరదాగా అన్న మాటలు మాత్రమే. కొంతమంది నా వ్యాఖ్యలను తప్పుబట్టి వివాదమయ్యేలా చేశారు. అందుకు ఎంతో బాధపడుతున్నా. ఆమె అంటే గౌరవం ఉంది. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఐశ్వర్యను ఒక్కసారైనా చూడటం కోసం ఆమె కారవాన్‌ చుట్టూ తిరిగా. షోలో భాగంగా నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఇమ్రాన్‌ అన్నారు.

* యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్‌ (Cancer) బారినపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంపై ప్రకటన చేసిన నాటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్న ఆమె.. చాలా అరుదుగా బాహ్య ప్రపంచంలోకి వస్తున్నారు. గత నెల రాజకుటుంబం వేడుకలో కన్పించిన కేట్‌.. ఇప్పుడు మరోసారి ప్యాలెస్‌ నుంచి బయటకు రానున్నారు. లండన్‌లో జులై 14న జరిగే వింబుల్డన్‌ (Wimbledon) ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ శనివారం వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z