అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్‌ని ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ట్రంప్‌పై దాడిని అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ట్రంప్‌పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖండించారు. అమెరికాలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, లోకల్ అథారిటీస్‌ను ఆమె అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z