Business

₹3లక్షలకు టాటా నానో ఈవీ-BusinessNews-July 13 2024

₹3లక్షలకు టాటా నానో ఈవీ-BusinessNews-July 13 2024

* డీ-మార్ట్ పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్‌ త్రైమాసిక ఫలితాలను (DMart Q1 Results) వెలువరించింది. తొలి త్రైమాసికంలో రూ.773.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది లాభం రూ.659 కోట్లతో పోలిస్తే 17.5 శాతం వృద్ధి నమోదైందని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ ఆదాయం సైతం 18.6 శాతం వృద్ధితో రూ.14,069 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్‌ ఎబిటా 18 శాతం పెరిగి రూ.1221.3 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ.1035.3 కోట్లుగా ఉంది. కంపెనీ మార్జిన్‌ 8.68 శాతంగా ఉంది. ఇదే త్రైమాసికంలో డీమార్ట్‌ కొత్తగా మరో ఆరు స్టోర్లను తెరిచింది. దీంతో జూన్‌ చివరి నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 371కి చేరింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1.15 శాతం లాభంతో రూ.4953 వద్ద ముగిసింది.

* ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (MTNL), భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) విలీనం విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. విలీన అంశాన్ని పక్కనపెట్టి ఎంటీఎన్‌ఎల్‌ కార్యకలాపాలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ఓ నెల సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. భారీ అప్పుల్లో ఉన్న ఎంటీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని కేంద్రం భావిస్తుండడమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాని బదులు కార్యకలాపాలు అప్పగించడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత సెక్రటరీల కమిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచి తర్వాత కేబినెట్‌ ఆమోదానికి పంపిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

* దేశంలోని ఐటీ సేవల కంపెనీల్లో మూడో అతి పెద్దదైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, జూన్‌ త్రైమాసికంలో రూ.4257 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.3534 కోట్లతో పోలిస్తే ఇది 20.4% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.26,296 కోట్ల నుంచి 6.6% పెరిగి రూ.28,057 కోట్లకు చేరింది. అయితే మార్చి త్రైమాసిక ఆదాయం రూ.28,499 కోట్లతో పోలిస్తే మాత్రం ఇది 1.6% తక్కువ.

* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలతో పాటు, చిరు వ్యాపారులూ తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో విస్తరించేందుకు వీలుగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత ‘ఏఐ ఏజెంట్‌’ను అందుబాటులోకి తెస్తామని సామాజిక మాధ్యమం మెటాకు చెందిన వాట్సప్‌ వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఇది వాడుకలోకి రానున్నట్లు పేర్కొంది. పెద్ద సంస్థలు సొంతంగా యాప్‌లు, కృత్రిమ చాట్‌బాట్‌లను నిర్వహిస్తాయి. కానీ, ఎంఎస్‌ఎంఈలకు అంత ఆర్థిక వనరులు ఉండవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సప్‌ స్మాల్‌ బిజినెస్‌ యాప్‌ను తీసుకొచ్చినట్లు మెటా బిజినెస్‌ మెసేజింగ్‌ డైరెక్టర్‌ రవి గార్గ్‌ వెల్లడించారు. వాట్సప్‌ వేదిక ద్వారా బీ2సీ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఏఐ ఏజెంట్‌ తోడ్పడుతుందని పేర్కొన్నారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 19.54 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో కార్పొరేట్లు రూ.57.4 లక్షల కోట్ల హయ్యర్ అడ్వాన్స్ టాక్స్ చెల్లించారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు తెలిపారు. గత నెల 15 నాటికి కార్పొరేట్ల అడ్వాన్స్ టాక్స్ తొలి విడుత చెల్లింపులు 27.34 శాతం పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.1.14 లక్షల కోట్ల కార్పొరేట్ ఇన్‌కం‌ టాక్స్ (సీఐఐ), రూ.34,470 కోట్ల పర్సనల్ ఇన్‌కం టాక్స్ (పీఐటీ) కూడా ఉంది.

* టాటా నానో (Tata Nano) కారు ఒక్కప్పుడు అంటే దాదాపు 14 ఏండ్ల క్రితం సామాన్య భారతీయ పౌరుడు కొనుగోలు చేసేందుకు అత్యంత చౌక ధరకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మనస్సులో పురుడు పోసుకున్నది.. మళ్లీ నూతన అవతార్‌లో అందరికీ అందుబాటులోకి వస్తున్నది. అదీ టాటా నానో.ఈవీ (Tata Nano.ev) రూపంలో వస్తోంది. ఇప్పటికైతే టాటా నానో.ఈవీ (Tata Nano.EV) కారు ఆవిష్కరణ తేదీ, దాని ధర వివరాలు, స్పెషిఫికేషన్స్‌పై టాటా మోటార్స్ (Tata Motors) అధికారికంగా ధృవీకరించకున్నా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారుపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం అధిక ధరల మార్కెట్లో ఇతర కార్లతో పోటీ పడుతూ తక్కువ ధరకు ఈ కారు తేవడం టాటా మోటార్స్ ముందు ఉన్న పెద్ద సవాల్. ప్రారంభంలో రూ.లక్షకే అందుబాటులోకి వచ్చిన టాటా నానో కారు.. కొత్త అవతార్ లో టాటా నానో.ఈవీ కారు ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని, హై ఎండ్ మోడల్ ధర రూ.ఏడెనిమిది లక్షలు ఉండొచ్చునని సమాచారం. ఈ టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారు సింగిల్ చార్జింగ్ చేస్తే సుమారు 200-300 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్.. ఇప్పటి వరకూ భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఇతర టాటా.ఈవీ కార్ల మాదిరిగానే టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారులోనూ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వినియోగిస్తారని సమాచారం. స్టాండర్డ్ ఏసీ చార్జింగ్, డీసీ ఫాస్ట్ చార్జింగ్ వసతులు కల్పిస్తారని టాటా మోటార్స్ వర్గాల కథనం. లగ్జరీ కార్లతో పోలిస్తే సదరు కారు ఫంక్షనింగ్‌కు ప్రియారిటీ ఇస్తూ బేసిక్ ఫీచర్లు జత చేస్తారని సమాచారం. ఇక ఇతర కార్లతో పోటీ పడేందుకు టాటా నానో.ఈవీ (Tata Nano.ev) కారు ధర నిర్ణయించడం టాటా మోటార్స్ (Tata Motors) ముందు ఉన్న అసలైన సవాల్.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z