Sports

వింబుల్డన్ అల్కా”రాజ్”

వింబుల్డన్ అల్కా”రాజ్”

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ నిలబెట్టుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో మూడో సీడ్‌ అల్కరాస్‌ 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో రెండో సీడ్‌ జకోవిచ్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన అల్కరాస్‌కు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. అయినా బలంగా నిలబడ్డ అతడు విజయంతో మ్యాచ్‌ ముగించాడు. మ్యాచ్‌లో ఈ స్పెయిన్‌ కుర్రాడి అథ్లెటిక్‌ నైపుణ్యాలు అబ్బురపరిచాయి. కోర్టులో బంతి ఎక్కడ పడ్డా అందుకునే విధంగా అతను వేగాన్ని ప్రదర్శించాడు. కోర్టు బయట నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి నెట్‌ దగ్గర బంతులను రిటర్న్‌ చేశాడు. క్రాస్‌కోర్టు షాట్లను అంతే సమర్థంగా అడ్డుకున్నాడు. కాళ్ల మధ్యలో నుంచి, వెనక్కి పరుగెడుతూ, ముందుకు సాగుతూ.. ఇలా శరీరాన్ని వంచుతూ బంతిని అవతలి కోర్టులోకి పంపించాడు. అతని నైపుణ్యాల ముందు జకోవిచ్‌ తేలిపోయాడు. నెల రోజుల క్రితమే మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న అతను తొలి రెండు సెట్లలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కాలికి పట్టీతోనే ఆడిన అతను నెట్‌ దగ్గర బంతిని రిటర్న్‌ చేయడంలో విఫలమయ్యాడు. బంతిని పదేపదే నెట్‌కు కొట్టాడు. ఫోర్‌హ్యాండ్‌ను సమర్థంగా వాడలేకపోయాడు. నెట్‌ దగ్గర అల్కరాస్‌ 22కి గాను 16 పాయింట్లు గెలిస్తే.. జకోవిచ్‌ ఏమో 53కి గాను 27 మాత్రమే నెగ్గాడు. అదే ప్రభావం చూపింది. మొదటి సర్వీస్‌ పాయింట్లలోనూ అల్కరాస్‌దే ఆధిపత్యం.

తొలి సెట్లో మొదటి గేమ్‌ జరిగిన తీరు చూస్తే మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదనిపించింది. ఈ గేమ్‌ కోసం క్రీడాకారులిద్దరూ గట్టిగా ప్రయత్నించారు. 7 సార్లు పాయింట్లు 40-40తో సమమయ్యాయి. చివరకు అయిదో సారి అల్కరాస్‌ బ్రేక్‌ పాయింట్‌ సాధించాడు. అయిదో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అతను, ఆపై 5-1తో దూసుకెళ్లాడు. అదే ఊపులో తొలి సెట్‌ దక్కించుకున్నాడు. రెండో సెట్లోనూ అల్కరాస్‌ జోరును జకోవిచ్‌ ఆపలేకపోయాడు. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అల్కరాస్‌ ఆగలేదు. విన్నర్లతో రెచ్చిపోయాడు. జకోవిచ్‌ను నెట్‌ దగ్గర ఆడిస్తూ ఫలితం రాబట్టాడు. నాలుగో గేమ్‌లో కోర్టు బయట నుంచి మెరుపు వేగంతో వచ్చి, నెట్‌ దగ్గర కింద పడబోతున్న బంతిని అల్కరాస్‌ గొప్పగా రిటర్న్‌ చేశాడు. ఏడో గేమ్‌లో మరోసారి బ్రేక్‌ సాధించాడు. ఆ వెంటనే సెట్‌ ముగించాడు. అయితే అప్పటివరకూ చప్పగా సాగుతున్న పోరును జకోవిచ్‌ ఒక్కసారిగా రసవత్తరంగా మార్చేశాడు. మూడో సెట్లో అతను గొప్పగా పుంజుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ సాగడంతో స్కోరు 4-4తో సమమైంది. తొమ్మిదో గేమ్‌లో అల్కరాస్‌ బ్రేక్‌ పాయింట్‌తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ వెంటనే జకోవిచ్‌ కూడా ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. 3 మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకుని అల్కరాస్‌ విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు. కానీ పోరును టైబ్రేకర్‌కు మళ్లించిన అల్కరాస్, ఇందులో పైచేయి సాధించాడు. జకోవిచ్‌ బంతిని నెట్‌కు కొట్టగానే రాకెట్‌ పడేసిన అతను విజయ గర్జన చేశాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాస్‌ 5 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z