* టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల నేపథ్యంలో ఓ నెటిజన్ ఎలాన్ మస్క్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దయచేసి మీ భద్రతను మూడు రెట్లు పెంచుకోండి..ఎందుకంటే దుండగులు ట్రంప్ దగ్గరకు వెళ్లగలిగారంటే మీ దగ్గరకు కూడా వస్తారు’’ అంటూ నెటిజన్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ఇకపై ప్రమాదకరమైన సమయాలు రానున్నాయి. గత ఎనిమిది నెలల్లో నాకు రెండుసార్లు బెదిరింపులు వచ్చాయి. బెదిరించిన వారిని టెక్సాస్‌లో అరెస్టు చేశారు. ’’ అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్‌కు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నందుకు రష్యాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు బెదిరించారని పేర్కొన్నారు. ఒక వేళ తాను అనుమానాస్పద స్థితిలో మరణిస్తే..మీరు దానిని ఎలా కనిపెడతారో అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుందంటూ హాస్యాస్పదంగా స్పందించారు. తాను ఏ క్షణంలోనైనా హత్యకు గురయ్యే అవకాశం ఉందని మస్క్ 2022లో పేర్కొన్నాడు. కొందరు తన రోజూవారీ కార్యకలాపాలను, ప్రయాణ ప్రదేశాల వివరాలను ఇతరులకు అందజేస్తున్నారని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు.
* దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా 2030 నాటికి రెండింతలై ఏటా ఏడు లక్షల కోట్ల డాలర్లుగా నమోదవుతాయని కెర్నీ అండ్ అమెజాన్ పే అధ్యయనం వెల్లడించింది. తొలుత ఆన్‌లైన్ కొనుగోళ్లలో డిజిటల్ పేమెంట్స్ ప్రారంభమయ్యాయని.. ఈ ధోరణి క్రమంగా మొత్తం చెల్లింపుల వ్యవస్థకూ విస్తరించిందని వివరించింది. సర్వేలో పాల్గొన్న వాళ్లలో 90 శాతం మంది ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) వైపే మొగ్గుచూపుతున్నట్లు వెల్లడించారు. ధనికుల్లో అత్యధిక మంది తమ లావాదేవీల్లో 80 శాతం డిజిటల్ మాధ్యమం ద్వారానే చేస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో మొత్తం ఆరు వేల మంది పాల్గొన్నారు. వీరిలో 1,000 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాల్లో చెందిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.
* బీమా చట్టం-1938లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉంది. 2047 నాటికి అందరికీ బీమా (Insurance) అందించాలనే లక్ష్యంలో భాగంగానే సవరణలు తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాబోయే బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టొచ్చని సమాచారం. ఈ బిల్లులో కాంపోజిట్ లైసెన్స్, డిఫరెన్షియల్ క్యాపిటల్, మధ్యవర్తులకు ఏకకాల రిజిస్ట్రేషన్, సాల్వెన్సీ నిబంధనల సడలింపు, క్యాప్టివ్ లైసెన్స్ జారీ, పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు, ఇతర ఆర్థిక ఉత్పత్తులనూ పంపిణీ చేసేందుకు బీమా సంస్థలకు (Insurance Companies) అనుమతి వంటి అంశాలు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ రంగంలో యూనివర్సల్, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్స్ బ్యాంకులు.. ఇలా వివిధ వర్గీకరణలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో బీమా చట్టంలో మార్పుల వల్ల ఈ రంగంలో ‘విభిన్న రకాల కంపెనీ’లు ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నిర్దిష్ట విభాగాలు లేదా ఉత్పత్తులపై దృష్టి సారించే బీమా సంస్థలు వచ్చే అవకాశం ఉంది.
* వ్యక్తిగత ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని ‘ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (AIFTP)’ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని సంఘం అధ్యక్షుడు నారాయణ్ జైన్ విన్నవించారు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘‘రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ.20 లక్షలకు పైబడిన ఆదాయంపై 25 శాతం పన్ను విధించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitaraman) ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్‌ఛార్జి, సెస్‌లను తొలగించాలని సూచించారు. వాటి కొనసాగింపును సమర్థించడానికి ప్రభుత్వం వద్ద ఇక ఎలాంటి కారణాలు లేవన్నారు.
* కర్ణాటకలో బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్‌ఆర్టీసీ (KSRTC) కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్(KSRTC) ఛైర్మన్ ఎస్ ఆర్ శ్రీనివాస్ ఆదివారం అన్నారు. 15 నుంచి 20శాతం మేర ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. టికెట్ ధరల్ని పెంచాలో, వద్దో సీఎం సిద్దరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. తమ సంస్థ మనుగడ సాగించాలంటే ఛార్జీల పెంపు తప్పదన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z