Videos

చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం-NewsRoundup-July 14 2024

చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం-NewsRoundup-July 14 2024

* బదిలీపై వేరొక పాఠశాలకు వెళ్తున్న తమ గురువులకు ఓ పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. ఆ ఉపాధ్యాయులకు విద్యార్థులంతా కలిసి క్షీరాభిషేకం చేశారు. పదేళ్లుగా సునీత, ఉషాకుమారి, సురేశ్‌ ఉపాధ్యాయులుగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఈ ముగ్గురూ ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. తమకిష్టమైన గురువులు పాఠశాలను వదిలి వెళ్తున్న నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో వారి తోటి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

* టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, హెడ్ కోచ్‌ అంశుమన్‌ గైక్వాడ్ (Anshuman Gaekwad) (71) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని మాజీ క్రికెటర్ల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘‘క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత వెటరన్ క్రికెటర్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే రూ. కోటి విడుదల చేయాలని కార్యదర్శి జై షా ఆదేశించారు. అంశుమన్‌ కుటుంబసభ్యులతో జై షా మట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గైక్వాడ్ కుటుంబానికి బోర్డు అండగా ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని బోర్డు పర్యవేక్షిస్తుంది. అంశుమన్‌ క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది’’ అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

* గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రూప్‌-2 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం రాత్రి మెరుపు ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ మీదుగా అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమాచారం ముందస్తుగా తెలియకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి చిక్కడపల్లిలోని గ్రంథాలయం పరిసరాల్లో మఫ్టీలో పోలీసు సిబ్బందితో వాహనాలతో పహారా ఏర్పాటు చేశారు. అశోక్‌ నగర్‌ క్రాస్‌రోడ్‌లో కూడా నిఘా ఉంచారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.

* విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరునెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్రావమైంది. ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో గట్టిగా ఏడ్చింది. ఏడుపు విని చిన్నారి అక్క (పెద్ద కుమార్తె) అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది. ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా.. పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

* అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై కాల్పుల ఘటన యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనూ చైనాలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌ ఫొటోలతో కూడా టీ షర్టులు వెల్లువెత్తాయి. డిజిటల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు తయారీదారులు పేర్కొంటుండగా.. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌గా మారాయి. తనపై దాడి జరిగిన అనంతరం ‘ఫైట్.. ఫైట్‌..’ అంటూ ట్రంప్‌ నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం దీనికి సంబంధించిన చిత్రాలతో చైనాలోని వ్యాపారులు టీ- షర్టులను రూపొందించడం మొదలుపెట్టారు. మొదటగా అక్కడి ఈ కామర్స్‌ వేదిక తొబావు (అలీబాబా)లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అక్కడి ఆన్‌లైన్‌లో భారీ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు గంటల వ్యవధిలో 2 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని చైనాకు చెందిన ఓ మహిళా వ్యాపారి పేర్కొన్నారు.

* భారాస నేత హరీశ్‌రావుపై కేంద్రమంత్రి, భాజపా నేత బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ భాజపాలోకి వచ్చినా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు. ఆయనకు ప్రజాభిమానం ఉందని, సునాయాసంగా గెలుస్తారని చెప్పారు. ‘‘కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హరీశ్‌రావు ఉద్యమ నాయకుడు.. జనంలో మంచి పేరుంది. నేను ఇలా అన్నానని హరీశ్‌ నాకు ఫోన్‌ చేశారనో, భాజపాలో చేరుతున్నారనో అనుకోవద్దు. భాజపాలో చేరాలని చాలా మంది భారాస ఎమ్మెల్యేలకు ఉంది. కానీ, చేరమని మేం ఎవరినీ అడగట్లేదు. భాజపాలోకి ఏ ఎమ్యెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందే. వారిని గెలిపించుకునే బాధ్యత మాది’’అని బండి సంజయ్‌ అన్నారు.

* ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) నిర్వాహకులు మాంఛో ఫెర్రర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫెర్రర్‌ని మంత్రి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. విన్సెంట్‌ ఫెర్రర్‌.. 1969లో ప్రారంభించిన ఆర్డీటీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో 3వేల గ్రామాల్లో సేవలు అందిస్తున్నారని మంత్రి లోకేశ్‌ తెలిపారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో ఆసుపత్రులు, ఇళ్ల నిర్మాణం, పేదలకు విద్య, వైద్య, ఆర్థిక సాయం, చెక్‌ డ్యామ్‌లు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ఆర్డీటీ కార్యలయాన్ని సందర్శించిన లోకేశ్‌.. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ట్రస్ట్‌ సేవల్ని మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేద్దామని నిర్వాహకులకు చెప్పారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ నేర్పించడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ ప్రాతిపాదనపై స్పందించిన ఆర్డీటీ నిర్వాహకులు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రభుత్వంతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తామని తెలిపారు.

* దేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా 2030 నాటికి రెండింతలై ఏటా ఏడు లక్షల కోట్ల డాలర్లుగా నమోదవుతాయని కెర్నీ అండ్‌ అమెజాన్ పే అధ్యయనం వెల్లడించింది. తొలుత ఆన్‌లైన్ కొనుగోళ్లలో డిజిటల్‌ పేమెంట్స్‌ ప్రారంభమయ్యాయని.. ఈ ధోరణి క్రమంగా మొత్తం చెల్లింపుల వ్యవస్థకూ విస్తరించిందని వివరించింది. సర్వేలో పాల్గొన్న వాళ్లలో 90 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్ల సమయంలో డిజిటల్‌ పేమెంట్స్‌ (Digital Payments) వైపే మొగ్గుచూపుతున్నట్లు వెల్లడించారు. ధనికుల్లో అత్యధిక మంది తమ లావాదేవీల్లో 80 శాతం డిజిటల్‌ మాధ్యమం ద్వారానే చేస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో మొత్తం ఆరు వేల మంది పాల్గొన్నారు. వీరిలో 1,000 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాల్లో చెందిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.

* నేపాల్‌ నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి (K P Sharma Oli) నియమితులయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ(69) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే. పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌, మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్‌-యూఎంఎల్‌- 77, ఎన్‌సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు.

* జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్‌ (58; 45 బంతుల్లో 1×4, 4×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే సిరీస్‌ భారత్‌ వశమైనప్పటికీ.. మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరారు. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (12; 5 బంతుల్లో 2×6) రజా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తొలి డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ (14; 11 బంతుల్లో 1×4,1×6) పెద్దగా రాణించలేకపోయాడు. ముజరబాణి బౌలింగ్‌లో క్లైవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ గిల్‌ (13; 14 బంతుల్లో 2×4), రెండో డౌన్‌లో వచ్చిన శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ జోడీని రిచర్డ్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద రజాక్‌కు క్యాచ్‌ ఇచ్చి.. గిల్‌ పెవిలియన్‌కు చేరాడు. ఐదు ఓవర్లలోపే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ జోరు తగ్గింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z