DailyDose

ఖమ్మం మరణాలు…భర్తే నిందితుడు-CrimeNews-July 14 2024

ఖమ్మం మరణాలు…భర్తే నిందితుడు-CrimeNews-July 14 2024

* ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతిపై మిస్టరీ వీడింది. భర్త బోడా ప్రవీణ్ కుమార్‌.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు తేల్చారు. 45 రోజుల తర్వాత శవపరీక్ష నివేదికలో ఈ విషయం నిర్ధరించారు. విషం కలిపిన ఇంజక్షన్‌ ఇచ్చి భార్యను హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మే 28న బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుమారి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజు పోలీసులు కారును తనిఖీ చేయగా.. ఖాళీ సిరంజ్‌ దొరికింది. దాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా.. విషం కలిపిన ఇంజక్షన్‌ ఇచ్చినట్టు తేలింది. ప్రవీణ్ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా.. అందులో కూడా కీలక ఆధారం లభ్యమైంది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్‌ ఇస్తే ఎన్నిగంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్టు గుర్తించారు. పోస్టు మార్టం నివేదిక, ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు.

* కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ నీచుడు ఆరు నెలల చిన్నారిపై పైశాచికత్వం చూపించాడు. ఊయలలో పడుకున్న చిన్నారిని అత్యాచారం చేశాడు. విజయనగరం జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు. ఆరు నెలల వయసున్న తన చిన్న కూతుర్ని ఊయలలో పడుకోబెట్టి.. ఆమె దగ్గరలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. ఇది గమనించిన నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర ఇంట్లోకి వెళ్లి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ పాప గట్టిగా ఏడ్చింది. ఇది విన్న చిన్నారి వాళ్ల అక్క అక్కడకు వెళ్లి ఆ దారుణాన్ని చూసింది. వెంటనే కిరాణానికి వెళ్లిన తల్లి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీంతో తల్లితో పాటు స్థానికులు అందరూ ఆగ్రహంతో వెళ్లారు. అది గమనినంచిన ఎరకన్న దొర అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం రక్తస్రావమైన చిన్నారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా గ్రామానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం నార్లవలసకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.

* గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్‌ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

* నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ మండలం దాస్‌నగర్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. బాలికల గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెంగా, మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులు.. కారు డ్రైవర్‌ను చితకబాదారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దాస్‌గర్ వద్ద బాలికల గురుకుల పాఠశాల ఉండడంతో ఆదివారం పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు వచ్చారు. బాలికలతో రోడ్డు పక్కన ముచ్చటిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z