Devotional

పూరీ రత్నభాండాగారానికి మరమ్మత్తుల అనంతరం లెక్కింపు

పూరీ రత్నభాండాగారానికి మరమ్మత్తుల అనంతరం లెక్కింపు

శ్రీక్షేత్ర రత్న భాండాగారానికి తొలుత మరమ్మతులు జరుగుతాయని, ఆ తరువాత ఆభరణాల లెక్కింపు చేపడతామని ఆలయ పాలనాధికారి అరవిందపాఢి ఆదివారం ఉదయం పూరీలో విలేకరులకు చెప్పారు. రహస్య గది నుంచి పురుషోత్తముని సంపదను సిద్ధంగా ఉంచిన మరో గదికి తరలించిన తరువాత భాండాగారం మరమ్మతులు పురావస్తుశాఖ నిపుణులు చేపడతారని, ఈ పనులు ముగిసిన తరువాత స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఆభరణాలు మళ్లీ రహస్య గదికి మార్చి లెక్కిస్తారన్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, వేర్వేరు పనుల కోసం ప్రత్యేక సంఘాలు నియమించినట్లు చెప్పారు. ఒకేసారి అంతా గుంపులుగా వెళ్లబోరని, నిర్ధారిత పనులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు మార్గదర్శకాల మేరకు లోపలికి వెళతారన్నారు. ఆదివారం భాండాగారం పరిస్థితి 11 మంది అధ్యయనం చేశారని, సంపద స్ట్రాంగ్‌ రూంకి తరలింపు జరుగుతుందన్న అంచనా ఉందన్నారు. వివరాలు వెంటనే తెలియజేయలేమని, అలాగని అంతా గోప్యంగా ఉంచబోమని, ప్రసార సాధనాల ద్వారా ప్రజలకంతా తెలియపరుస్తామన్నారు. రత్నభాండాగారం లోపల వెలుతురు లేనందున ఓడ్రాఫ్‌ దళాలు విపత్తుల సమయాల్లో వినియోగించే సెర్చ్‌లైట్లు రహస్య గదికి మధ్యాహ్నం తరలించారు. ఆభరణాలు భద్రపరచడానికి ఆరు చెక్క పెట్టెలనూ లోపలికి తీసుకెళ్లారు. భాండాగారం తలుపులు తెరుచుకున్న తరువాత పెద్ద సంఖ్యలో గబ్బిలాలు వెలుపలకు వచ్చాయి. హైమాస్ట్‌ సెర్చ్‌ దీపాలతో లోపలికి వెళ్లిన ప్రతినిధి బృందం వెల్లడించే వివరాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z