Fashion

కూలర్ వద్ద కుర్చీల కోసం కొట్లాట…పెళ్లి రద్దు

కూలర్ వద్ద కుర్చీల కోసం కొట్లాట…పెళ్లి రద్దు

ఎయిర్‌ కూలర్‌ వద్ద కూర్చోవడంపై వధూవరుల బంధువులు కోట్లాటకు దిగారు. దీంతో వరుడి బంధువుల ప్రవర్తనను వధువు నిలదీసింది. ఘర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిత్బరగావ్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పెళ్లి జరుగుతోంది. అయితే ఎయిర్‌ కూలర్‌ ముందున్న కుర్చీలపై కూర్చోవడంపై వరుడి కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావడంతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు.

కాగా, వరుడు బంధువుల ప్రవర్తనను పెళ్లికూతురు నిలదీసింది. దీంతో వివాదం కాస్త మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వధువు పెళ్లి క్యాన్సిల్‌ చేసింది. పెళ్లి కొనసాగింపును నిరాకరించింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పెళ్లి రద్దు నిర్ణయాన్ని ఆమె మార్చుకోలేదు. మరోవైపు గ్రామంలోని పంచాయతీ వద్దకు ఈ వివాదం చేరింది. చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఇరు వర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వరుడు హుకుమ్ చంద్ జైస్వాల్, అతడి బంధువు పంకజ్, వధువు తండ్రి నంద్ జీ గుప్తా, ఆమె సోదరుడు రాజేష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే వధువు పెళ్లి రద్దు చేయడంపై ముస్తఫాబాద్‌కు చెందిన వరుడు హుకుమ్‌చంద్ జైస్వాల్‌ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి తంతు ముగుస్తుండగా కూలర్‌ వద్ద కూర్చోవడంపై తమ కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య గొడవ జరిగినట్లు చెప్పాడు. పెళ్లిని రద్దు చేసుకోవద్దని వధువును తాను వేడుకున్నట్లు తెలిపాడు. పెళ్లిలో చిన్న గొడవలు జరుగుతాయని చెప్పి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అయినప్పటికీ పూర్తి కావస్తున్న పెళ్లి కొనసాగడాన్ని వధువు నిరాకరించిందని అన్నాడు. ఇరువురి బంధువుల కోట్లాటలో తన ప్రమేయం ఏమీ లేకపోయినా పర్యవసానాలను తాను భరించాల్సి వచ్చిందని వాపోయాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z