WorldWonders

అత్యవసరంగా సమావేశమైన పార్లమెంట్…ఎలుగుబంట్లను హతమార్చేందుకు ఏకగ్రీవ ఆమోదం

అత్యవసరంగా సమావేశమైన పార్లమెంట్…ఎలుగుబంట్లను హతమార్చేందుకు ఏకగ్రీవ ఆమోదం

రొమేనియాలో కొన్నేళ్లుగా ఎలుగుబంట్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 ఎలుగుబంట్లను చంపాలనే నిర్ణయానికి రొమేనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. రొమేనియా పర్యావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 8వేల ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా. అయితే, కొన్నేళ్లుగా వీటి దాడులు ఎక్కువ కావడం ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. గత 20ఏళ్లలో 26 మంది చనిపోగా.. 274 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఓ పర్వతారోహకుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచింది. ఈ తరహా దాడులకు వాటి ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడమే కారణమని చట్టసభ సభ్యులు వాదించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడుల కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది 481 ప్రాణులను చంపాలని ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. గతేడాది 220 ఎలుగుబంట్లను చంపగా.. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. అయితే, పర్యావరణ సంఘాలు మాత్రం ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z