Business

SBI రుణాల వడ్డీరేట్లు పెంపు-BusinessNews-July 15 2024

SBI రుణాల వడ్డీరేట్లు పెంపు-BusinessNews-July 15 2024

* ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(13A) ప్రకారం వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును (HRA Exemption) కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్‌ఆర్‌ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు. ఆదాయపు పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుత హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని చాలాకాలం క్రితం నిర్ణయించారు. మెట్రో, మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపును ఈసారి కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబయి, కోల్‌కతా, దిల్లీలో మూల వేతనంలో 50 శాతంపై హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు (HRA Exemption) కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40 శాతంగా కొనసాగుతోంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50 శాతం పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూలవేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపునకు పరిగణిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును అనుమతించాలని కోరుతున్నారు.

* పొగాకు ప్రకటనకు (Tobacco ads) సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health ministry) ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ప్రకటనలను ఇకపై క్రికెట్ స్టేడియంలో ప్రదర్శించకూడదని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. పాన్‌ మసాలా, పొగాకు మిశ్రమం ఉన్న చూయింగ్‌ గమ్‌, గుట్కా, పొగ రహిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను టోర్నీలు జరిగే సమయంలో మైదానంలో ప్రదర్శించవద్దని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇకనుంచి ప్రజలను ఈ దురలవాటుకు బానిసను చేసేలా ప్రముఖ నటులు, మాజీ క్రికెటర్లు వీటిలో నటించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని సూచించనుంది. ఈ యాడ్స్‌ ద్వారా పొగాకు ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేశ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

* దేశీయ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో సెషన్‌లో లాభాలను దక్కించుకున్నాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు, దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సోమవారం నాటి ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు లాభాల్లోనే కదలాడాయి. అయితే, త్రైమాసిక ఫలితాల సీజను మొదలు కావడంతో పాటు టోకు ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టిన మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 145 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ (Nifty) 24,600 మార్క్‌కు చేరువైంది. కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సెన్సెక్స్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఒక దశలో దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి ఇంట్రాడేలో 80,862 కొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో రికార్డుల నుంచి వెనక్కి వచ్చిన సూచీ.. చివరకు 145.52 పాయింట్ల లాభంతో 80,664.86 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 84.50 పాయింట్లు లాభపడి 24,586.70 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 83.60గా ముగిసింది.

* శాన్‌స్టార్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈనెల 19-23 తేదీల్లో జరగనుంది. రూ.510.15 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. 4.18 కోట్ల కొత్త షేర్ల జారీ ద్వారా రూ.397.10 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో 1.19 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.113.05 కోట్లు సేకరించనుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణి రూ.90-95. రిటైల్‌ మదుపర్లు రూ.14,250తో కనీసం 150 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దేశీయ అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ నిధుల వ్యయం ఆధారిత (MCLR) రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం వెల్లడించింది. కొన్ని కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచింది. స‌వ‌రించిన రేట్లు నేటి (2024 జులై 15) నుంచే అమ‌ల‌వుతాయ‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏడాది కాల‌వ్యవధి గ‌ల ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, ఆరు నెల‌ల కాల‌వ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాల‌ప‌రిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి ఎస్‌బీఐ పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్‌ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానించి ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z