* నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. ఈనెల 7న అదృశ్యమైన బాలికను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి శవాన్ని తీసుకొచ్చి కేసీ కెనాల్ వద్ద దాచారు. ఈ విషయాన్ని బాలురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి, పెదనాన్న చెప్పడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గజ ఈత గాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు, 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని వివరించారు.
* ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ భార్యకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. సుకేశ్ కుటుంబానికి చెందిన 26 లగ్జరీ కార్లను విక్రయించేందుకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు సమర్థించింది. వాటిని విక్రయించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా వచ్చిన నగదు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఈడీని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్.. నేర కార్యకలాపాల ద్వారా రూ.వందల కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన లగ్జరీ కార్లను విక్రయించేందుకు ఈడీ అనుమతి కోరగా ట్రయల్ కోర్టు గతంలో అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ సుకేశ్ భార్య లీలా పాలోస్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం.. వాహనాల భద్రత, జీవనకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని విక్రయించడమే ఉత్తమమని పేర్కొంటూ ఈడీకి ఆదేశాలు ఇచ్చింది.
* సామాజిక మాధ్యమాల వేదికగా చోటుచేసుకునే కొన్ని పరిచయాలు పెళ్లి వరకు దారితీస్తున్న ఘటనలు చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడితో లేటు వయసులో అమెరికన్ వృద్ధురాలు ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా భారత్‌కు వచ్చి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాక్వెలిన్ ఆస్టిన్ (78)కు భారత్‌కు చెందిన భరత్ జోషీ (34)తో పరిచయం ఏర్పడింది. వారి ఫేస్‌బుక్ స్నేహం చివరకు ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో రాజస్థాన్‌లోని కోటాకు వచ్చిన ఆమె.. జోషీని పెళ్లి చేసుకుంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఆస్టిన్ అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో జైపుర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు కన్నుమూసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
* వైద్యం సాయం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ (51)పై దారుణం చోటుచేసుకుంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కొపీ సర్జరీ చేయించుకున్న సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఆర్టిమిస్ ఆస్పత్రిలో అటెండెంట్‌గా పనిచేస్తున్న ఠాకూర్ సింగ్ (24)గా గుర్తించారు. ఆదివారం ఉదయం మహిళ మత్తులో ఉన్న సమయంలో ఈ దుశ్చర్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. జులై 9న బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు. అనంతరం వార్డుకు తరలించగా.. ఆమె వెంట కుమార్తె ఉన్నారు. ఆదివారం ఉదయం తన తల్లి దగ్గర ఠాకూర్ సింగ్ ఉన్నట్లు గుర్తించి అలారం మోగించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో రోగుల భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ ఘటనలో నిష్పాక్షిక దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపారు. నిందితుడిని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించగా.. బాధితురాలు సోమవారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
* కర్ణాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. తలకు రాసే నూనె తాగి బలన్మరణానికి పాల్పడింది. మృతురాలిని వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన జమీమాగా గుర్తించారు. ఆమె గత నెలలో జాన్‌బాబును ప్రేమ వివాహం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కోడూరు బీచ్‌లో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం కేజీఎఫ్‌లో బంధువుల వద్ద జమీమా ఉంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది.
* గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని చిందం మాధవి (23) ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మాధవి తండ్రి లచ్చయ్య ఇటీవల మృతి చెందగా, తల్లి లక్ష్మి మానసికంగా ఇబ్బంది పడుతోంది. మాధవి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతూ.. వ్యవసాయ పనులకు వెళ్లేది. తల్లి లక్ష్మి 15 రోజుల కిందట నర్సింగాపూర్‌లోని తన పెద్ద కూతురు ఇంటికి వెళ్లగా, మాధవి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. రోజూ ఇంటి ముందు తాళం వేసి.. వెనుక తలుపు నుంచి లోపలకు వెళ్లి గడియ పెట్టి నిద్రించేది. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి నిద్రపోయింది. సోమవారం ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలవడంతో ఎంతకూ పలకలేదు. అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. అయితే ఇంటి ముందు తలుపుకు తాళం వేయకుండా కేవలం గడియపెట్టి ఉంది. దాన్ని తీసి లోపలకు వెళ్లి చూడగా.. ఉరేసుకొని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z