* బంగారం ధరలకు (Gold price) మళ్లీ రెక్కలొచ్చాయి. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతోంది. దీనికి దేశీయంగానూ డిమాండ్ ఏర్పడడం బంగారం ధరల పెరుగుదల కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు బంగారం ధర మొన్న మొన్నటి వరకు 2350 డాలర్లకు అటూ ఇటుగా ట్రేడవుతూ వచ్చింది. తాజాగా బంగారం ధర ఔన్సు 2440 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మేలో అత్యధికంగా 2449 డాలర్లు పలకడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ట్రేడవుతోంది. దేశీయంగా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర పన్నులు కలుపుకొంటే రూ.76,200 పైనే పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 30 డాలర్లపైనే ట్రేడవుతోంది. దీంతో స్థానికంగా వెండి కిలో ధర రూ.94 వేలు పలుకుతోంది.
* జులై 23న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్-2024 (Union Budget 2024) రూపకల్పన పక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని కేంద్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం నార్త్ బ్లాక్‌లో సంప్రదాయ హల్వా వేడుక (Halwa Ceremony) నిర్వహించారు. అధికారులందరికీ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్వయంగా హల్వా వడ్డించారు. ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
* హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ స్టార్టప్ ఐకెన్ హీల్ (Icanheal) సంస్థ.. వెంచర్ క్యాపిటల్ (VC) సంస్థ IvyCap వెంచర్స్ నుంచి రూ.15 కోట్ల నిధులను సేకరించింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి క్లిష్టమైన సంరక్షణ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సంరక్షణ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌కు ఈ నిధులు ఉపయోగించాలనే యోచనలో ఉంది. ఈ నిధులు కార్యకలాపాలను మెరుగుపరచడానికి, ఎక్కువ మంది ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి, టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి, భౌగోళికంగా విస్తరించడానికి ఉపయోగిస్తారు. గిరీష్ పొద్దార్, అమిత్ బ్యాక్లీవాల్ స్థాపించిన ముంబయికి చెందిన ఈ స్టార్టప్.. రోగుల అవసరాలకు ఆరోగ్య సంరక్షణ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ రాణించాయి. కంపెనీల ఫలితాలు వెలువడుతున్న వేళ ఇంట్రాడేలో మరోసారి సరికొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. గరిష్ఠ స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడితో ఆఖర్లో స్వల్ప లాభాలతో జీవనకాల గరిష్ఠాల వద్ద సూచీలు ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,731.49 (క్రితం ముగింపు 80,664.86) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,598.06 – 80,898.30 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 51.69 పాయింట్ల లాభంతో 80,716.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 26.30 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.58గా ఉంది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా 444 రోజుల కాల వ్యవధితో కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఎస్‌బీఐలోని ఇతర ఎఫ్‌డీ పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకం ఇదే. ప్రస్తుతం 400 రోజులకు అమృత్ కలశ్ పేరిట మరో డిపాజిట్ పథకాన్నీ ఎస్‌బీఐ అందిస్తోంది. దీనిపై 7.10 వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనం. ఈ పథకం గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియనుంది.
* విద్యుత్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేంచిన ఫేమ్-3 (FAME) పథకాన్ని త్వరలో తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. భవిష్యత్‌లో దీనిపై ప్రకటన ఉండబోతుందని చెప్పారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో (Union budget) మాత్రం దీని ప్రస్తావన ఉండకపోవచ్చని పేర్కొన్నారు. వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దీనిపై విలేకరులతో మాట్లాడారు.
* బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా రెండు కాలవ్యవధులతో ఎఫ్‌డీ పథకాలను తీసుకొచ్చింది. 333 రోజులకు ఎఫ్‌డీ చేస్తే సాధారణ పౌరులకు 7.15 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే 399 రోజులకు అందిస్తున్న మరో ఎఫ్‌డీ డిపాజిట్లపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.75 వడ్డీని ఇస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z